
ఈ ఎన్నికల్లో తనకు టిక్కెట్ రానందుకు ఎలాంటి నిరాశ చెందలేదని బీజేపీ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మెజారిటి సీట్లు సాధిస్తుందని అన్నారు. తనకు టిక్కెట్ రానందుకు ఎలాంటి బాధ లేదని, ఈసారి ఎంపీగా పోటి చేయబోయే కిషన్ రెడ్డి తరపున ప్రచారం చేస్తానని ఆయన అన్నారు. కిషన్ రెడ్డికి ఎల్లపుడూ తన మద్ధతు, ఆశీర్వాదం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో.. కేసీఆర్ మరియు కేటీఆర్ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు వారే గెలుస్తారని కలలు కంటున్నారని, అవన్నీ కల్లలుగానే మిగిలిపోతాయని అన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అనీ, టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని అన్నారు. హిందుత్వమంటే కేవలం యాగాలు,పూజలు చేయడమే అని కేసీఆర్ అనుకుంటున్నారని, కాని అసలైన హిందుత్వమంటే జాతీయవాదం మరియు దేశభక్తి అని బీజేపీ భావిస్తోందని, అది తమ సంస్కృతి, వారసత్వంలో భాగమని అన్నారు. ఒకవైపు హిందుత్వం గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. మరోవైపు హిందువులపై దాడి చేసిన పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇతిహాదుల్ ముస్లైమీన్ (AIMIM) తో తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారని దత్తాత్రేయ ఈ సందర్భంగా అన్నారు.