
- ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచే అత్తింటోళ్ల వేధింపులు
- భర్త ఇంటి ఎదుట కూతురుతో కలిసి మహిళ నిరసన
- ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితురాలు వేడుకోలు
పద్మారావునగర్, వెలుగు : ఆడ పిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధిస్తున్న ఓ భర్త, అత్తమామలు, ఆడపడుచుల నిర్వాకం ఇది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కూతురుతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ కు చెందిన పవిత్రకు 2015లో సికింద్రాబాద్ పార్శీగుట్ట బాపూజీనగర్‌కు చెందిన కావేటి కార్తీక్చంద్రతో పెళ్లి అయింది.
వరకట్నం కింద రూ.10లక్షలు, 40 తులాల బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలతో పాటు విలువైన సామగ్రి ఇచ్చారు. కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పగా.. పెండ్లి తర్వాత ప్రైవేట్ జాబ్చేస్తున్నట్లు తెలిసింది. కొంతకాలం సంసారం సాఫీగానే సాగింది. 2016లో హాసిని(7) పుట్టింది. రెండో సంతానం ఐవీఎఫ్ పద్ధతిలో కనాలని, లేదంటే మళ్లీ ఆడపిల్ల పుడుతుందని, వేధించడమే కాకుండా రెండు సార్లు బలవంతంగా భర్త అబార్షన్ కూడా చేయించాడు.
ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాలంటూ..
ఇల్లు కట్టుకునేందుకు అదనపు కట్నంగా మరో రూ.30లక్షలు తేవాలంటూ.. తన తల్లి ఆస్తిని అతని పేరిట రిజిస్ర్టేషన్ చేయించాలంటూ భర్త, అత్తమామలు రమాదేవి, రాంచంద్రం, ఇద్దరు ఆడపడుచులు వేధించడమే కాకుండా తీవ్రంగా కొట్టడడంతో చేతి వేలు కూడా విరిగిపోయిందని బాధితురాలు వాపోయింది. వేధింపులు తాళలేక కూతురుని తీసుకొని 2020 ఏప్రిల్ లో పుట్టింటింకి వెళ్లిపోయానని ఆమె పేర్కొంది.
గత నెలలో సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, రెండుసార్లు కౌన్సిలింగ్ కు పిలిస్తే ఒకసారి మాత్రమే అటెండ్ అయ్యాడని చెప్పింది. తను చంపాపేట తహసీల్దార్ ఆఫీస్‌లో జూనియర్అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నట్టు తండ్రి లేకపోవడంతో పుట్టింట్లోనే ఉంటూ తల్లిని చూసుకుంటున్నట్టు తెలిపింది.
తప్పించుకు తిరుగుతున్న తన భర్తతో తేల్చుకుందామని కుటుంబసభ్యులతో కలసి పవిత్ర ఆదివారం ఉదయం అత్తారింటికి వెళ్లింది. భర్తతో పాటు అతని కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి మంగళ్ హట్‌లోని బంధువులు ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ఇంటి ముందే బైఠాయించి, ధర్నాకు దిగింది. తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.
ఎస్సీ కుల సర్టిఫికెట్లతో జాబ్ లు పొంది..
కార్తీక చంద్రది పూసల కులం అని, అతని కుటుంబం షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) పేరుతో సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిసింది. కార్తీక్‌చంద్ర తండ్రి రామచంద్రం ఎస్సీ సర్టిఫికెట్ తో ఆయుష్ శాఖలో జాబ్ చేసి ఇటీవలే రిటైర్డ్అయ్యారు. అతని ఇద్దరు కూతుళ్లలో వాణి అర్చన కూడ గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో ఆయుష్ శాఖలో ప్రభుత్వ జా బ్ చేస్తుందని, చిన్న ఆడపడుచు సౌమ్య ఎంబీబీఎస్ సీటు సంపాదించినట్లు పవిత్ర బంధువులు మీడియాకు తెలిపారు. కార్తీక్ చంద్ర కుటుంబసభ్యుల నిర్వాకంపై పూర్తి విచారణ జరపాలని అంబేద్కర్యువజన సంఘ రాష్ర్ట అధ్యక్షుడు మదన్ బాబు డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసులు పెట్టాలని, డబ్బులను రికవరీ చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు.