
న్యూఢిల్లీ: 2025, ఏప్రిల్ 22 భారత దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ప్రకృతి అందాలకు నిలయమైన జమ్ము కాశ్మీర్లో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యేలా ఉగ్ర దాడి జరిగింది. బైసరన్ మైదానం ప్రాంతంలోని పహల్గాంలో ప్రకృతి అందాలు వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల తూటాలకు 26 మంది టూరిస్టులు బలయ్యారు. కేవలం ఒక వర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు.
దేశంలో సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే పహల్గాం టెర్రర్ ఎటాక్‌కు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం మారణహోమాన్ని కళ్లారా చూసిన ఓ ప్రత్యక్షి సాక్షి దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. 26 మంది పౌరులను కనికరం లేకుండా కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఈ దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారని వెల్లడించాడు ప్రత్యక్ష సాక్షి.
ఇదే కాకుండా కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని దాడి చేశారని.. పేరు, మతం అడిగి మరి మారణకాండ కొనసాగించారని ఎన్ఏఐకి చెప్పాడు. ఇవే కాకుండా సదరు సాక్షి పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలు దర్యాప్తులో చెప్పాడని అధికార ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల హింసాత్మక చర్యలకు ఈ ఘటనలు నిదర్శనమని పేర్కొన్నారు మండిపడ్డాయి అధికార వర్గాలు.