
GST News: దాదాపు ఐదేళ్ల నుంచి దేశంలో ప్రజలు డిజిటల్ చెల్లింపులకు ఎక్కువగా అలవాటు పడ్డారు. ప్రధానంగా యూపీఐ చెల్లింపుల రాక భౌతికంగా డబ్బు వినియోగాన్ని చాలా వరకు తగ్గించింది. అయితే ప్రజల అలవాట్లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వ్యాపారులు సైతం తమ బిజినెస్ ఖాతాలను తెరచి యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జీఎస్టీ అధికారుల కన్ను ఈ వ్యాపారుల ట్రాన్సాక్షన్ల పై పడటంతో ఆందోళనలు మెుదలయ్యాయి.
మెున్న పొరుగుతున్న ఉన్న కర్ణాటక జీఎస్టీ అధికారులు యూపీఐ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వ్యాపారుల ఖాతాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ డేటాను తెప్పించుకుని.. చాలా మందికి నోటీసులు పంపించటం పెద్ద దుమారం రేపింది. దీంతో చాలా మంది యూపీఐ చెల్లింపులు వద్దు డబ్బు నేరుగా చెల్లించాలని డిమాండ్ చేయటం స్టార్ట్ చేశారు. దీని తర్వాత తాజాగా ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని కమర్షియల్ టాక్స్ అధికారులు యూపీఐ చెల్లింపు సంస్థలను తమ రాష్ట్రాల్లోని వ్యాపారుల ఖాతాలకు సంబంధించిన చెల్లింపుల డేటా అందించాలని కోరాయని వెల్లడైంది.
ALSO READ : YouTubeలో మరిన్ని లైక్‌లు, ఫాలోవర్లు కావాలా..ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
అయితే సదరు యూపీఐ డేటా ప్రకారం ఏడాదికి రూ.40 లక్షల వ్యాపార టర్నోవర్ దాటిన సంస్థలకు, యజమానులకు పన్ను నోటీసులు పంపుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే జీఎస్టీ చట్టం ప్రకారం వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలకు పైన ఉన్నట్లయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఒకపక్క ప్రజలు యూపీఐ వాడకానికి అలవాటుపడిపోతే మరో పక్క వ్యాపారులు మాత్రం తమకు వస్తున్న చిక్కులతో క్యాష్ కావాలంటూ యూపీఐ చెల్లింపు స్కానర్లు, స్టిక్కర్లను తమ వ్యాపార సముదాయాల్లో తొలగిస్తున్నారు.
జూలై 16న కర్ణాటకలోని టీషాపులు, బేకరీలు, కాఫీ షాపుల యజమానులు రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ నోటీసులను నిరసిస్తూ ఈ నెల 25న నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. నోటీసులను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు జూలై 24 వరకు వారు గడువు ఇచ్చినట్లు చెప్పారు. దీనికి సపోర్టుగా పాల ఉత్పత్తును రెండు రోజుల పాటు అమ్మకాలు నిలిపివేయాలని కూడా నిర్ణయించారు. దీనిపై యూపీఐ సంస్థలతో పాటు టాక్స్ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతానికి కర్ణాటక జీఎస్టీ అధికారులు పరిమితి దాటి వ్యాపార టర్నోవర్ కలిగిన సంస్థలకు, యజమానులకు జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోవాలని మాత్రమే నోటీసులు పంపారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి పన్నులు చెల్లించాలని డిమాండ్ చేయలేదని తేలింది.
ఇదే పరిస్థితి తమకు వచ్చే అవకాశం ఉందని ఏపీలోని వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏపీ జీఎస్టీ అధికారులు కూడా యూపీఐ డేటా అడగటంపై చిన్న హోటల్ వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద ట్రేడర్ల వరకు అలర్ట్ అవుతున్నారు. తమ షాపుల వద్ద యూపీఐ చెల్లింపు స్కానర్లను తొలగిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డిజిటల్ చెల్లింపులు వద్దని, నగదు రూపంలోనే ఇకపై చెల్లింపులను అంగీకరించాలని చాలా మంది నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోరి కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్న యూపీఐ చెల్లింపులకు దూరంగా ఉంటేనే భవిష్యత్తులో తమకు సమస్యలు తగ్గుతాయని చాలా మంది వ్యాపారులు భావిస్తున్నారు.