IND vs AUS: సిడ్నీ వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ శతకం

IND vs AUS: సిడ్నీ వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ శతకం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. హిట్ మ్యాన్ అంటే ఏంటో.. తనపై విమర్శలు వస్తే బ్యాట్ తో ఎలా జవాబిస్తాడో మరోసారి నిరూపించాడు. శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 105 బంతుల్లో 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ కు ఇది 50 వ సెంచరీ కావడం విశేషం. వన్డే కెరీర్ లో ఇది 33 వ శతకం కావడం విశేషం. 

236 పరుగుల ఛేజింగ్ లో రోహిత్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. ఎలాంటి తడబాటు లేకుండా అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబట్టాడు. తొలి వికెట్ కు గిల్ తో కలిసి 69 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రోహిత్.. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన రోహిత్.. మూడో వన్డేలో ఏకంగా సెంచరీతో చెలరేగడం విశేషం. ఈ సెంచరీతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వార్తలకు చెక్ పడడం ఖాయం. 

టీ20 ఫార్మాట్ లో 5 సెంచరీలు చేసిన రోహిత్.. వన్డేల్లో 33.. టెస్టుల్లో 12 సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న  పదో ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రోహిత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 9 సెంచరీలతో సచిన్ తో కలిసి అగ్ర స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న రోహిత్ వన్డేల్లో కోహ్లీ, సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. 
 

►ALSO READ | Australia women's cricket: ఇండోర్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లపై లైంగిక దాడి.. 30 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు