Australia women's cricket: ఇండోర్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లపై లైంగిక దాడి.. 30 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Australia women's cricket: ఇండోర్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లపై లైంగిక దాడి.. 30 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రస్తుతం ఇండియాలో మహిళా వరల్డ్ కప్ జరుగుతుండగా సిగ్గుమాలిన చర్య చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను 30 ఏళ్ల వ్యక్తి వెంబడించి లైంగికంగా వేధించినట్టు వార్తలు వస్తున్నాయి. గురువారం (అక్టోబర్ 23)  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రిపోర్ట్స్ ప్రకారం ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇండోర్‌లోని ఒక కేఫ్ నుండి  హోటల్‌కు తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో 30 ఏళ్ళ వ్యక్తి వారిని వెంబడించి లైంగికంగా వేధించాడు. ఖజ్రానా రోడ్ సమీపంలోని ది నైబర్‌హుడ్ కేఫ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్‌కు తిరిగి వెళుతున్న ఇద్దరు క్రీడాకారిణులను నిందితుడు వెంబడించాడని తెలిసింది.

నిందితుడు అసభ్యకరమైన సైగలు చేశాడని.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ను పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే  ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సెక్యూరిటీ మేనేజర్ డానీ సిమ్మన్స్ MIG కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లైంగికంగా వేధించిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని, సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని ట్రాక్ చేసి, అగౌరవంగా ప్రవర్తించడం.. వేధించడం వంటి నేరాల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు ఖజ్రానాలో ఉంటున్న 30 ఏళ్ల అకీల్‌గా గుర్తించారు.

" మా ఆటగాళ్ళు సమీపంలోని ఒక కేఫ్‌కు కొద్ది దూరం నడుస్తున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో, ఒక వ్యక్తి వారిని ఫాలో అవుతూ  పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని వారు నాకు తెలిపారు. ఇద్దరు ఆటగాళ్లను వారి హోటల్‌కు తిరిగి తీసుకెళ్లారు. వారికి ఎటువంటి శారీరక గాయాలు కాలేదు". అని ఆస్ట్రేలియా భద్రతా మేనేజర్ సిమ్మన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 74, 78 కింద కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా శనివారం (అక్టోబర్ 25) సౌతాఫ్రికాతో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. మధ్య ప్రదేశ్ వేదికగా ఇండోర్ ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిస్తే టేబుల్ టాపర్ అవుతుంది.