తిరువనంతపురం: ఏనుగు దంతాల సేకరణ కేసులో ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు కేరళ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మోహన్ లాల్ దగ్గర ఉన్న ఏనుగు దంతాలను చట్టబద్ధం చేస్తూ గతంలో కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవని జస్టిస్ ఎకె జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్ సెబాస్టియన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అలాగే.. ఏనుగు దంతాలు కలిగి ఉండటానికి మోహన్ లాల్‌కు ప్రభుత్వం జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ లైసెన్స్‌ను కూడా హైకోర్టు రద్దు చేసింది. ఈ అంశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972లోని సెక్షన్ 44 ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది.
వివాదం ఏంటంటే..?
ప్రముఖ నటుడు మోహల్ లాల్ అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. 2011 డిసెంబర్ 21న ఐటీ అధికారులు కొచ్చిలోని తేవరలో ఉన్న మోహన్ లాల్ ఇంట్లో రైడ్స్ చేశారు. ఈ క్రమంలో మోహన్ లాల్ ఇంట్లో రెండు జతల ఏనుగు దంతాలును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు అక్రమంగా సేకరించినట్లు తేలడంతో.. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘన కింద ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ 2012లో కేసు నమోదు చేసింది.
ALSO READ | పోలీస్ అధికారి వేధిస్తున్నాడంటూ.. యంగ్ లేడీ డాక్టర్ ఆత్మహత్య
ఓ వైపు కేసు విచారణ నడుస్తోన్న సమయంలోనే 2016లో ఏనుగు దంతాలు చట్టబద్ధంగా కొనుగోలు చేశానని.. తనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని మోహన్ లాల్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. మోహన్ లాల్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేరళ ప్రభుత్వం ఈ మేరకు మోహన్ లాల్‌కు యాజమాన్య ధృవీకరణ పత్రాలను జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు ఆధారంగా మోహన్ లాల్‌పై అటవీ శాఖ పెట్టిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చూసింది. కానీ పెరుంబవూర్ మేజిస్ట్రేట్ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో పెరుంబవూర్ మేజిస్ట్రేట్ కోర్టు నిర్ణయాన్ని మోహల్ లాల్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ఇదే సమయంలో మోహన్ లాల్ అక్రమంగా ఏనుగు దంతాలు సేకరించాడని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జేమ్స్ మాథ్యూ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎకె జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్ సెబాస్టియన్‌లతో కూడిన డివిజన్ 2025, అక్టోబర్ 24న కీలక తీర్పు వెలువరించింది. మోహన్ లాల్‌కు ప్రభుత్వం జారీ చేసిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌ను చట్టవిరుద్ధమని ప్రకటించి దానిని రద్దు చేసింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రక్రియలో లోపాలున్నాయని, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
