ఆమె ఓ డాక్టర్. అయినా వేధింపులు తప్పలేదు.. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీస్ ఆఫీసరే వేధింపులకు పాల్పడ్డాడు. విసిగిపోయిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు పోలీస్ ఆఫీసరే కారమణమని సూసైడ్ నోట్‌లో రాసి చనిపోయింది. ఆమె డాక్టర్ కావడంతో వైద్య సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంచలనం సృష్టించిన యంగ్ లేడీ డాక్టర్ ఆత్మహత్య మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.
మహారాష్ట్ర ఫల్తాన్ సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న యువ డాక్టర్ సంపద ముండే బుధవారం (అక్టోబర్ 23) రాత్రి ఫల్తాన్‌లోని ఓ హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఒక పోలీస్ అధికారి మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ సంఘటన మెడికల్ కమ్యూనిటీలో ,రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
సూసైడ్ నోట్ లో ఏముంది?..
సంపద ముండే చేతిపై రాసుకున్న నోట్‌లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (PSI) గోపాల్ భాద్నే తనను మానసికంగా, శారీరక వేధింపులకు గురిచేశాడని..అతను ఆమెను 5 నెలల్లో 4 సార్లు బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అలాగే మరొక పోలీస్ అధికారి ప్రశాంత్ బంకార్ మానసికంగా ఒత్తిడికి గురి చేశాడని నోట్ లో రాసింది. సంపద ముండే ఆరోపణలు పోలీసులను తీరుకు అద్దం పడుతున్నాయని.. నిందితులపై చర్యలకు వైద్యసంఘాలు డిమాండ్ చేశాయి.
