ఈ ఆధునిక ప్రపంచంలో మరో అద్భుతం జరిగింది. మీ షర్ట్, ప్యాంట్లు ఇకపై కేవలం ట్రెండీ ఫ్యాషన్ కోసమే కాదు, మీ పనులన్నీ చేసే స్మార్ట్ అసిస్టెంట్లుగా మారబోతున్నాయి. శాస్త్రవేత్తలు "A-టెక్స్‌టైల్" అనే అద్భుతమైన వస్త్రం (textile) కనిపెట్టారు. ఈ బట్ట(cloth) ఏ సాధారణ వస్త్రాన్నైనా మైక్రోఫోన్‌గా మార్చేస్తుంది. దీనితో, మీరు మీ షర్ట్ కాలర్ లేదా స్లీవ్ దగ్గర మాట్లాడితే చాలు నేరుగా ChatGPT లేదా ఇంట్లో ఉండే స్మార్ట్ డివైజెస్(లైట్లు, స్పీకర్లు) కంట్రోల్ చేయవచ్చు.
అవును.. ఇది నిజం... సినిమాల్లో చూసిన టెక్నాలజీ ఇప్పుడు నిజం కాబోతోంది. ఇంతకుముందు బట్టల్లో పెట్టే స్మార్ట్ సెన్సార్లు చాలా పెద్దగా, గట్టిగా, అసౌకర్యంగా ఉండేవి. అవి మాటలను సరిగా గుర్తించేవి కావు. కానీ, ఇప్పుడు శాస్త్రవేత్తలు "ట్రైబోఎలక్ట్రిసిటీ" అనే కొత్త పద్ధతిని వాడారు. అంటే, రెండు ఉపరితలాలు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు లేదా కదిలినప్పుడు కొద్దిపాటి కరెంట్‌ను పుట్టిస్తాయి.
ఈ స్మార్ట్ వస్త్రం ఎలా పని చేస్తుంది?
"A-టెక్స్‌టైల్" అనేది పల్చని పొరలతో తయారు చేశారు. మనం మాట్లాడినప్పుడు వచ్చే ధ్వని (శబ్దం) తరంగాలు ఈ పొరలను కంపిస్తాయి. ఆ కదలికల వల్ల కొద్దిగా విద్యుత్ పుడుతుంది. ఈ విద్యుత్ సంకేతాన్ని AI (కృత్రిమ మేధస్సు) వ్యవస్థకు పంపిస్తే, అది మనం ఎం చెప్పామో అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు ఈ బట్టకు పూల ఆకారంలో ఉండే చిన్న నానో-పదార్థాలను కలిపారు. ఇవి ఎక్కువసేపు కరెంట్ పట్టుకుని ఉంచడం వల్ల, మాటల సిగ్నల్ మరింత ఖచ్చితంగా, స్పష్టంగా ఉంటుంది. ఈ సిగ్నల్ నేరుగా ఫోన్‌కు, కంప్యూటర్‌కు లేదా స్మార్ట్ స్పీకర్‌కు వైర్‌లెస్ ద్వారా పంపబడుతుంది.
►ALSO READ | ఆపిల్ కొత్త ఫీచర్.. ఐఫోన్, ఆండ్రాయిడ్ నుండి డేటా ట్రాన్స్ఫర్ ఈజీగా చెయ్యొచ్చు.. ఎలా అంటే ?
ఈ టెక్నాలజీలో గొప్ప విషయం ఏమిటంటే, మొత్తం బట్టను మార్చాల్సిన అవసరం లేదు. మీ చొక్కా కాలర్, జేబు లేదా స్లీవ్ మీద 'A-టెక్స్‌టైల్' చిన్న ముక్కను కుడితే చాలు, ఆ బట్ట వాయిస్ అసిస్టెంట్‌గా మారిపోతుంది. శాస్త్రవేత్తల పరీక్షల్లో, ఈ వస్త్రం 97.5% కచ్చితత్వంతో వాయిస్‌ను గుర్తించింది. ముఖ్యంగా, ఇది ఎక్కువ శబ్దలు ఉన్న చోట్ల కూడా చాలా బాగా పనిచేయడం విశేషం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ విజయవంతమైతే ఉష్ణోగ్రతను కొలిచే, మనతో మాట్లాడే, మన ఇష్టాలను అర్థం చేసుకునే బట్టలు త్వరలోనే మనం ధరించే అవకాశం ఉంది.
