- ప్రమాదకరంగా మారిన బెంగళూరు హైవే
- పన్నెండేండ్ల క్రితం పాలెంలో ఇదే తరహా ఘటన
- ఇప్పుడు కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో..
- ప్రమాణాలు పాటించకపోవడమే కారణమా..?
- ఎమర్జెన్సీలో గ్లాస్ బ్రేక్ చేసే సుత్తిలు లేక పోవడమా?
- ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ లేకపోవడమా?
- బస్సు డిజైన్ లోపాలూ కారణమా..?
- కారణమేదైనా గాల్లో కలుస్తున్న ప్రయాణికుల ప్రాణాలు
హైదరాబాద్: స్లీపర్ బస్సులు ప్రాణాలు తీస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం, ఏసీ కోసం బస్సంతా ఫుల్ ప్యాక్ అయి ఉండటం. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బతికి బయటపడేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండకపోవడం ప్రధానమైన కారణమని నిపుణులు చెబుతున్నారు. బస్సులో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలు ఆర్పే పరికరాలు కూడా ఉండకపోవడం కారణమనే వాదన బలంగా ఉంది. సరిగ్గా పన్నెండేండ్ల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలె వద్ద కూడా.. కర్నూలు జిల్లా చిన్ టేకూరు మండలంలో జరిగిన తరహా బస్సు ప్రమాదం లాంటిదే చోటు చేసుకుంది. ఆ సమయంలో 45 మంది మృత్యువాత పడ్డారు. వారిలో దాదాపుగా అందరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే కావడం గమనార్హం.
స్లీపర్ బస్సుల్లో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా డిజైన్ల మార్పిడిపై తయారీ సంస్థలు చర్యలు తీసుకోకపోవడం కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతి వోల్వో బస్సులో మూడు చోట్లు విండో గ్లాస్ లను బ్రేక్ చేయడానికి సుత్తిలను పెడతారు. ఇవాళ తెల్లవారు జామున జరిగిన ప్రమాదానికి గురైన బస్సులో సుత్తిలు ఉన్నాయా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకమే. ఎమర్జెన్సీలో ఏం చేయాలనే అంశాలపై బస్సెక్కిన ప్రయాణికులకు డ్రైవర్లు, సిబ్బంది అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా అది జరగడం లేదు. దీనికి తోడు స్లీపర్ బస్సులు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల పడుకున్న వ్యక్తి కిందకు దిగి సుత్తితో గ్లాస్ బ్రేక్ చేసి బయటికి దూకాల్సి ఉంటుంది. ప్రమాద సమయంలో టెన్షన్ తో ఇదంతా అర్థం కాకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పాలెం వద్ద జరిగిన ప్రమాదంలో 51 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో బతికి బట్ట కట్టింది. డ్రైవర్ తో పాటు ఐదుగురు మాత్రమే. తరచూ ప్రమాదాలు జరిగాయని 2012వ సంవత్సరంలోనే చైనా దేశంలో స్లీపర్ బస్సులపై నిషేధం విధించారు. కానీ మన దేశంలో స్లీపర్ బస్సులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రమాదాలకు గురై న బస్సుల్లో ఎక్కువ భాగం స్లీపర్ బస్సులు కావడం విశేషం.
పాలెంలో పన్నెండేండ్ల క్రితం
హైదరాబాద్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్‌తో సహా 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం సరిగ్గా పన్నెండేండ్ల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని గుర్తుకు తెచ్చింది. 2013 అక్టోబర్ 30న బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బస్సు ఓ కారును ఓవర్‌టేక్ చేస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డీజిల్ ట్యాంక్ లీక్ అయి పేలుడు సంభవించడంతో ఆ దుర్ఘటనలో మొత్తం 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. వారిలో అంతా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ఉన్నారు. ఈ ప్రమాదంలో కేవలం బస్సు డ్రైవరుతో పాటు ఐదుగురు ప్రయాణికులు మాత్రమే మృత్యుంజయులుగా బయటపడ్డారు.
డిజైన్ లోపమేనా?
స్లీపర్ బస్సుల్లో సాధారణంగా 30 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులైతే 36-40 మంది ప్రయాణించవచ్చు. స్లీపర్ బస్సుల్లో 2x1 సీటింగ్ ఉంటుంది. ఒక్కో బెర్త్ ఆరు అడుగుల పొడవు,2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. బెర్త్‌లను అనుసంధానించే గ్యాలరీతోనే సమస్య వస్తోంది. గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. దీంతో ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా.. సీట్ల మధ్యలో లిమిటెడ్ స్పేస్ ఉండటం వల్ల బయటికి వచ్చేందుకు ఇబ్బందులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
