సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సింగరేణి కాలరీస్ కంపెనీ, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం (అక్టోబర్ 25) కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. గ్రామీణ ప్రాంత యువత కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జాబ్ మేళాలో250 కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని.. మొత్తం 5 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెండు రోజులుగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
నిరుద్యోగ యువత వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనీ.. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని విమర్శించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రూప్ వన్, గ్రూప్ టూ లో దాదాపు డెబ్బై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు.
ఈ జాబ్ మేళా లో ఇప్పటివరకు దాదాపు రెండొందల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. మరో 5000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశ్యం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమేనని అన్నారు.
