అర్ధరాత్రి బైక్‎ను ఢీకొట్టి పరార్: బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్‎పై కేసు

అర్ధరాత్రి బైక్‎ను ఢీకొట్టి పరార్: బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్‎పై కేసు

బెంగుళూర్: కన్నడ బిగ్ బాస్ ఫేమ్, నటి దివ్య సురేష్‎ వివాదంలో చిక్కుకుంది. బెంగుళూర్‎లో బైక్‎ను ఢీకొట్టి ఆపకుండా అలానే వెళ్లిపోయిందన్న ఆరోపణల మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

పోలీసుల వివరాల ప్రకారం.. 2025, అక్టోబర్ 4 తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‎ను కారు ఢీకొట్టి ఆపకుండా  వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్‎పై వెళ్తున్న మహిళ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళ బంధువు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారు నంబర్‌ను కనుగొని ఆ కారు నటి దివ్య సురేష్‎దిగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు దివ్య సురేష్ పై కేసు నమోదు చేసి ఆమె కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

అయితే, పోలీసులు కారు సీజ్ చేసిన రాత్రే దివ్య సురేష్ తన కారును విడిపించుకున్నారని సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‎గా మారడంతో నటి దివ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైక్‎ను ఢీకొట్టి ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డ కనీస మానవత్వం లేకుండా అలానే వెళ్లిపోవడం ఏంటని దివ్యపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.