డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు..స్టూడెంట్లకు వేరే స్కూళ్లలో సర్దుబాటు

డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు..స్టూడెంట్లకు వేరే స్కూళ్లలో సర్దుబాటు

హైదరాబాద్, వెలుగు: చిన్నారిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని బీఎస్​డీడీఏవీ పబ్లిక్ స్కూల్​ గుర్తింపును సర్కారు రద్దు చేసింది. ఆ స్కూల్​లో చదువుతున్న స్టూడెంట్లు విద్యా సంవత్సరం నష్టపోకుండా పక్కనే ఉన్న స్కూళ్లలో వారిని సర్దుబాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీఈవోను ఆదేశించారు. బీఎస్ డీడీఏవీ పబ్లిక్​ స్కూల్​లో ప్రస్తుతం 650 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. చిన్నారిపై ప్రిన్సిపల్ కారుడ్రైవర్ లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. చిన్నారి తల్లిదండ్రులు, స్టూడెంట్ యూనియన్లు స్కూల్​ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో కారుడ్రైవర్, ప్రిన్సిపాల్ పై కేసు నమోదైంది. అయినా ఆందోళనలు తగ్గకపోవడంతో స్కూల్ గుర్తింపును రద్దుచేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా డీఈవోదేనని మంత్రి సబిత స్పష్టం చేశారు.  

స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పాటు...

విద్యార్థులు, చిన్నారులపై లైంగిక దాడుల సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలను ప్రభుత్వానికి  సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి సబిత ప్రకటించారు. ఈ కమిటీలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని ఆమె వెల్లడించారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తుందని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

నిందుతుడిని కఠినంగా శిక్షించాలి: ఐద్వా

చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్సులు ఎ.పద్మ, కె.నాగలక్మి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ముషీరాబాద్ చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ చిన్నారులపై అఘాయిత్యాలు నాగరిక సమాజానికి సిగ్గుచేటన్నారు. డొనేషన్ల, ఫీజుల పేరుతో లక్షలు దండుకుంటున్న ప్రైవేటు స్కూళ్ల అరాచకాలకు అంతు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఏవీ స్కూల్ ఫీజులు దండుకోవడమే తప్ప పిల్లలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ఈ సంఘటనలో ప్రిన్సిపల్ కు కూడా కఠిన శిక్ష వేయాలని, పోక్సో యాక్టు కింద విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని స్కూళ్లల్లో తనిఖీలు చేపట్టి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.