- ఏర్పాటు చేయాలని దుకాణాల యజమానులకు డీసీఏ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మెడికల్ షాపుల్లో కొన్న మందులు వికటించినా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఇకపై ప్రజలు సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా క్యూఆర్ కోడ్, టోల్ ఫ్రీ నంబర్లను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని మెడికల్ షాపుల యజమానులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆదేశించింది.
పేషెంట్ల భద్రతను పెంచేందుకు కేంద్రం చేపట్టిన ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రాం ఆఫ్ ఇండియా (పీవీపీఐ) లో భాగంగా డీసీఏ శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. మెడికల్ షాపులో ఉండే పీవీపీఐ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి లేదా అక్కడ బోర్డుపై ఉన్న 1800 1803024 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి మందు పేరు, వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వివరాలు తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల ఆ మందు నాణ్యతపై అధికారులకు సమాచారం అందుతుంది. తద్వారా భవిష్యత్తులో ఇతరులకు ఆ మందు వల్ల హాని కలగకుండా డీసీఏ చర్యలు తీసుకుంటుంది.
