- 180 మెడికల్ షాపులకు డీసీఏ షోకాజ్ నోటీసులు జారీ
- అబార్షన్ కిట్లు, యాంటీబయాటిక్స్ కూడా అమ్ముతున్నట్టు వెల్లడి
- ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో మత్తు మందుల సేల్స్ దందాపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) కొరడా ఝులిపించింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా డేంజరస్ మందులు అమ్ముతున్న మెడికల్ షాపులలో దాడులు నిర్వహించింది. రూల్స్ కు విరుద్ధంగా కొందరు మత్తు మందులు, యాంటీబయాటిక్స్ తదితర మందులు అమ్ముతున్నట్లు ఇటీవల డీసీఏ అధికారుల దృష్టికి వచ్చింది.
దీంతో అధికారులు రాష్ట్రంలోని పలు మెడికల్ షాపులపై బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూల్స్ కు విరుద్ధంగా మెడికల్ డ్రగ్స్ అమ్ముతున్న షాపులపై చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుండటంతో యువత మత్తు కోసం మెడికల్ షాపుల్లో మందులు కొని వాడుతున్నారంటూ గత ఆదివారం ‘వీ6 వెలుగు’లో వార్త పబ్లిష్ అయింది. ఈ నేపథ్యంలో అక్రమంగా మత్తు మందులు అమ్ముతున్న పలు మెడికల్ షాపులపై అధికారులు రెయిడ్స్ చేపట్టారు.
180 షాపులకు షోకాజ్ నోటీసులు
దాడుల్లో పలు మెడికల్ షాపులు రూల్స్ కు విరుద్ధంగా మందుల అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే డేంజరస్ మందులు అమ్మడం, ఎక్స్ పైరీ డేట్ (గడువు) ముగిసిన మందుల స్టాక్ ఉంచడం, మందుల కొనుగోలు, సేల్స్ బిల్లులు చూపకపోవడం, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ లేకుండానే షాపులు నడిపించడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. మొత్తం180 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం పేర్కొన్నారు.
టార్గెట్ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్
షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ హెచ్1 మందులను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలి. అమ్మిన మందుల వివరాలను, పేషెంట్, డాక్టర్ వివరాలను నమోదు చేయాలి. కానీ, డీసీఏ తనిఖీల్లో హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, అబార్షన్ కిట్లు, యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్ముతున్నట్టు తేలింది.
అక్రమ మందులపై సమాచారం ఇవ్వండి
అక్రమంగా మత్తు మందులు, యాంటీబయాటిక్స్, అబార్షన్ కిట్స్ అమ్మకాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను డీసీఏ కోరింది. మందుల అక్రమ అమ్మకాలు, నాణ్యత లోపాలు, రెసిడెన్షియల్ ఏరియాల్లో మత్తు మందుల తయారీ వంటివి దృష్టికి వస్తే కంప్లైంట్ చేయాలని వెల్లడించింది. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969ను సంప్రదించవచ్చని సూచించింది.

