ఐదేండ్లు దాటిన పిల్లలపై  కోర్బవాక్స్ ట్రయల్స్ కు ఓకే

ఐదేండ్లు దాటిన పిల్లలపై  కోర్బవాక్స్ ట్రయల్స్ కు ఓకే
  • బయాలజికల్–ఈ కరోనా టీకా ఫేజ్ 2, 3 ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి

న్యూఢిల్లీ:ఐదేండ్లు దాటిన పిల్లలపై కోర్బవాక్స్ కరోనా టీకాతో ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు శుక్రవారం కేంద్ర బయోటెక్నాలజీ శాఖ వెల్లడించింది. పిల్లలపై ట్రయల్స్ లో భాగంగా సేఫ్టీ, రియాక్షన్, టాలరేబిలిటీ, వ్యాధి నిరోధకత వంటి అంశాలను పరిశీలించనున్నట్లు తెలిపింది. పెద్దవాళ్లలో ఈ టీకాతో ఫేజ్ 3 కంపారేటర్ సేఫ్టీ, ఇమ్యూనోజెనిసిటీ అంశాలపై ట్రయల్స్ కు కూడా డీసీజీఐ ఓకే చెప్పినట్లు తెలిపింది. ఈ టీకాతో ఫేజ్ 1, 2 ట్రయల్స్ లో వచ్చిన ఫలితాలను సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించి, నివేదిక ఇచ్చిన తర్వాత అనుమతులు వచ్చాయని పేర్కొంది. కోర్బవాక్స్ టీకాను ఆర్ బీడీ ప్రొటీన్ సబ్ యూనిట్ ఆధారంగా కేంద్ర బయోటెక్నాలజీ శాఖ సహకారంతో హైదరాబాద్ కు చెందిన బయాలజికల్-ఈ (బీఈ) కంపెనీ అభివృద్ధి చేసింది. పిల్లలపై తమ టీకా ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతులు రావడంపై కంపెనీ ఎండీ మహిమ దాట్ల మీడియాతో మాట్లాడారు. ఈ అనుమతుల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) వద్ద అప్లికేషన్ పెట్టుకునేందుకు కూడా అవకాశం దొరికిందని తెలిపారు. కాగా, మన దేశంలో ఇప్పటివరకు పిల్లల(12 నుంచి 18 ఏండ్ల మధ్యవాళ్లకు) కోసం గుజరాత్ కు చెందిన జైడస్ క్యాడిలా కంపెనీ తయారు చేసిన జైకోవ్ డీ స్వదేశీ టీకాకు మాత్రమే ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి వచ్చింది. అమెరికన్ కంపెనీ తయారు చేసిన కొవొవాక్స్ పిల్లల టీకా (2 నుంచి 17 ఏండ్ల వారికి)తో ఫేజ్ 2, 3 ట్రయల్స్ ను చేపట్టేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ కు గత జులైలో డీసీజీఐ అనుమతి ఇచ్చింది.