ప్రభుత్వ వేలం పాటలో కోట్లు పెట్టి స్థలం కొన్న వ్యక్తికి ఢిల్లీ హైకోర్టులో షాక్ ఎదురైంది. బిడ్డింగ్ కింద బయానా రూ.4కోట్ల 45 కట్టాక.. తాను కొన్న చోట మౌలిక సదుపాయాలు లేవంటూ మిగిలిన మెుత్తం చెల్లించకుండా అడ్డం తిరిగాడు. ఈ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పు అతడిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీ హైకోర్టు నవంబర్ 11, 2025న ఇచ్చిన ఒక కీలక తీర్పు ప్రకారం.. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) ప్లాట్లను "యాజ్ ఈజ్ వేర్ ఈజ్" ప్రాతిపదికన విక్రయించినప్పుడు, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవనే సాకుతో కొనుగోలుదారులు బకాయిలు చెల్లించకుండా ఆపడం సరికాదని స్పష్టం చేసింది. ఈ తీర్పు వేలం ద్వారా భూములు కొనుగోలు చేసే వారికి, ప్రభుత్వ సంస్థలకు మధ్య ఉండే బాధ్యతలను వివరిస్తుంది.
2007లో ద్వారకాలోని సెక్టార్ 20లో ఒక కమర్షియల్ ప్లాట్ కోసం DDA నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక వ్యక్తి రూ.17 కోట్ల51లక్షలకు బిడ్ దాఖలు చేసి విజేతగా నిలిచారు. నిబంధనల ప్రకారం అతను 25% సొమ్ము అంటే రూ.4కోట్ల 45లక్షలు 'బయానా'గా చెల్లించారు. మిగిలిన 75% సొమ్మును నిర్ణీత సమయంలోగా చెల్లించాల్సి ఉండగాసదరు కొనుగోలుదారు గడువు పొడిగింపు కోరుతూ వచ్చాడు. చివరగా 2008 వరకు గడువు ఇచ్చినప్పటికీ అతను బకాయిలు చెల్లించలేదు.
ప్లాట్ వద్ద మురుగునీటి వ్యవస్థ, నీటి కనెక్షన్, రోడ్లు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు లేవని.. అవి కల్పించే వరకు మిగిలిన సొమ్ము చెల్లించనని బిడ్డర్ వాదించాడు. సదుపాయాలు కల్పించకుండానే DDA తన బయానా సొమ్మును జప్తు చేయడం అన్యాయమని కోర్టును ఆశ్రయించాడు.
ఈ వివాదం ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా.. అక్కడ కొనుగోలుదారుడికి చుక్కెదురైంది. ప్లాట్ విక్రయం "యాజ్ ఈజ్ వేర్ ఈజ్" ప్రాతిపదికన జరిగిందని, అంటే కొనుగోలుదారు స్థలాన్ని స్వయంగా పరిశీలించి, ఉన్న స్థితిలోనే కొనుగోలు చేయడానికి అంగీకరించారని ఆర్బిట్రేటర్ స్పష్టం చేశారు. సదుపాయాలు కల్పించడం చెల్లింపుకు ముందస్తు షరతు కాదని ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించారు. అంతేకాకుండా కొనుగోలుదారు వద్ద నిధుల కొరత ఉండటం వల్లే చెల్లింపు ఆగిపోయిందని, మౌలిక సదుపాయాల లేమి అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని ఇందులో తేల్చారు.
ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పులో ఎటువంటి చట్టపరమైన లోపాలు లేవని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. రూ.4.45 కోట్ల బయానా జప్తు చేయడం సరైనదేనని కోర్టు కూడా అభిప్రాయపడింది. బహిరంగ వేలంలో ఒక బిడ్డర్ తన బాధ్యతను విస్మరించినప్పుడు, ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని లెక్కించడం కష్టమని, అందుకే బయానా జప్తు క్లాజును ఒక సరైన నష్టపరిహారంగా పరిగణించాలని కోర్టు వెల్లడించింది. ఇది భారతీయ కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 74 ప్రకారం 'శిక్ష' కాదని, 'నష్టపరిహారం' అని స్పష్టం చేస్తూ కొనుగోలుదారు అప్పీలును కొట్టివేసింది.
