అబుధాబి టీ10 లీగ్‌లో ట్రోఫి గెలిచిన రైనా టీమ్

అబుధాబి టీ10 లీగ్‌లో ట్రోఫి గెలిచిన రైనా టీమ్

అబుధాబి టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన డెక్కన్ గ్లాడియేటర్స్..ఫైనల్లో 37 పరుగుల తేడాతో న్యూయార్క్ స్ట్రైకర్స్పై విజయం సాధించింది. 

రైనా విఫలం..

మొదట బ్యాటింగ్ చేసిన సురేష్ రైనా నేతృత్వంలోని గ్లాడియేటర్స్..10 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 40 పరుగులు, డేవిడ్ వైస్ 43 పరుగులు సాధించారు. కెప్టన్ రైనా 7 పరుగులే చేసి నిరాశ పర్చాడు. న్యూయార్క్ స్ట్రైకర్స్ బౌలర్లలో అకీల్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాహబ్ రియాజ్, పోలార్డ్ తలో ఓ వికెట్ దక్కించుకున్నారు. 

పోలార్డ్ ఒక్కడే..

129 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూయార్క్ స్ట్రైకర్స్..గ్లాడియేటర్స్ బౌలర్ల ధాటికి తడబడింది. కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు బ్యాట్స్మన్లలో ఇద్దరు టాపార్డర్ బ్యాట్స్ మన్ డకౌట్ అయ్యారు.  చివర్లో  జోర్దాన్ థాప్సాన్, 22 పరుగులు, పోలార్డ్ 23 పరుగులతో రాణించారు. అయితే ఆప్పటికే చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో..న్యూయార్క్ స్ట్రైకర్స్ చివరకు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 91 పరుగులకే పరిమితమైంది. గ్లాడియేటర్స్ బౌలర్లలో జోష్ లిటిల్, మహమ్మద్ హస్నయిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జహీర్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.