ఇంగ్లండ్‌‌ చీఫ్‌‌ కోచ్‌‌గా మెకల్లమ్‌‌ను కొనసాగిస్తారా?

ఇంగ్లండ్‌‌ చీఫ్‌‌  కోచ్‌‌గా మెకల్లమ్‌‌ను కొనసాగిస్తారా?

లండన్‌‌: ఆస్ట్రేలియాతో యాషెస్‌‌ టెస్ట్‌‌ సిరీస్‌‌ను కోల్పోయిన నేపథ్యంలో.. ఇంగ్లండ్‌‌ చీఫ్‌‌ కోచ్‌‌ బ్రెండన్‌‌ మెకల్లమ్‌‌ భవిష్యత్‌‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. అతన్ని కొనసాగించాలా? వద్దా? అనే దానిపై చర్చించేందుకు ఈసీబీ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ రిచర్డ్‌‌ గౌల్డ్‌‌, చైర్మన్‌‌ రిచర్డ్‌‌ థాంప్సన్‌‌.. ఆస్ట్రేలియా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆసీస్‌‌తో జరిగే చివరి యాషెస్‌‌ టెస్ట్‌‌ సందర్భంగా మెకల్లమ్‌‌, కెప్టెన్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌తో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. 

2010–11 తర్వాత యాషెస్‌‌ సిరీస్‌‌ గెలవలేకపోయిన ఇంగ్లండ్‌‌, ప్రస్తుతం సిరీస్‌‌ను 11 రోజుల్లోనే చేజార్చుకుంది. ఆసీస్‌‌ టాప్‌‌ బౌలర్లు హాజిల్‌‌వుడ్‌‌, కమిన్స్‌‌ లేకపోయినా.. ఇంగ్లండ్‌‌ బ్యాటింగ్‌‌ కుప్పకూలింది. బౌలింగ్‌‌లోనూ ఘోరంగా ఫెయిలైంది. దీంతో మెకల్లమ్‌‌ బజ్‌‌బాల్‌‌ స్ట్రాటజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చడంలో మెకల్లమ్‌‌ విఫలమవుతున్నాడని ఈసీబీ భావిస్తోంది.  ప్రారంభంలో టెస్ట్‌‌ జట్టు కోచ్‌‌గా వచ్చిన మెకల్లమ్‌‌ ఒప్పందం 2027 వన్డే వరల్డ్‌‌ కప్‌‌ వరకు ఉంది. గతేడాది వన్డే రికార్డు 4–11, యాషెస్‌‌ ఓటమి నేపథ్యంలో  అన్ని ఫార్మాట్లలో కోచ్‌‌గా కొనసాగించాలా? వద్దా? అని ఈసీబీ నిర్ణయించనుంది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్‌‌ కప్‌‌కు టైమ్‌‌ ఎక్కువగా లేకపోవడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కోచ్‌‌ను మార్చే చాన్స్‌‌ ఉండకపోవచ్చని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.