
రోమ్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్ ఫేక్ వీడియో బాధితురాలిగా మారారు. దీంతో ఆమె న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఓ అసభ్యకరమైన వీడియోకు తన ముఖాన్ని మార్ఫ్ చేశారని పేర్కొంటూ ఇద్దరిపై ఆమె రూ.90 లక్షల(1 లక్ష డాలర్లు)కు పరువు నష్టం దావా వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జార్జియా మెలోని డీప్ ఫేక్ వీడియో 2022లో అమెరికాలోని పోర్నోగ్రఫిక్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయినట్లు గుర్తించారు. అప్పటికి ఆమె ప్రధాని కాలేదన్నారు. వీడియో అప్‌లోడ్ చేయడానికి వాడిన స్మార్ట్‌ఫోన్‌ను ట్రాక్ చేసి నిందితులను గుర్తించినట్లు చెప్పారు. 40 ఏళ్ల వ్యక్తితో పాటు, 73 ఏళ్ల అతడి తండ్రి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తేల్చారు.