ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మరో మూడు మెడల్స్ ఖాయం అయ్యాయి. రికర్వ్ స్టార్ ఆర్చర్లు దీపికా కుమారి, బొమ్మదేవర ధీరజ్, అంకితా భాకట్, సంగీత, రాహుల్ సెమీఫైనల్ చేరుకున్నారు. మంగళవారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్లలో వీళ్లంతా సత్తా చాటారు. విమెన్స్ క్వార్టర్ ఫైనల్లో దీపిక 7–-3తో లీ గహ్యున్ (సౌత్ కొరియా)ను చిత్తు చేయగా.. అంకితా భాకట్ 6-–4తో టాప్ సీడ్ జాంగ్ మిన్హీకి షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో సంగీత 7–1తో జరే రేహనె (ఇరాన్)ను ఓడించింది.
ఒక సెమీ ఫైనల్లో దీపిక, అంకిత తలపడనుండటంతో ఇండియాకు ఫైనల్ బెర్త్ ఖాయమైంది. మెన్స్ రికర్వ్ క్వార్టర్స్‌లో ధీరజ్, ఉజ్బెకిస్తాన్ అమీర్‌ఖాన్ సాదికోవ్ నాలుగు సెట్ల తర్వాత 5–5తో సమంగా నిలిచారు. షూటాఫ్‌లోనూ చెరో పది పాయింట్లు రాబట్టగా.. ధీరజ్ బాణం టార్గెట్‌కు దగ్గరగా ఉండటంతో విజయం అతడినే వరించింది. రాహుల్ 6–-2తో లిన్ జి సియంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇక, కాంపౌండ్ ఈవెంట్లలో వెన్నం జ్యోతి సురేఖ, పృథికా ప్రదీప్ సెమీ ఫైనల్ చేరుకొని పతక ఆశలను సజీవంగా ఉంచారు. కానీ, మెన్స్‌లో సాహిల్ జాదవ్, అభిషేక్ వర్మ ఇంటిదారి పట్టారు.
