
- 31 వరకు అసెంబ్లీలో ఆంక్షలు
హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను, వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 24న మరోసారి ప్రత్యక్షంగా విచారించనున్నారు. శుక్రవారం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో జరగనున్న ఈ విచారణకు హాజరుకావాల్సిందిగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డికి అసెంబ్లీ కార్యాలయం నోటీసులు పంపించింది.
అలాగే, ఈ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ సాగనుంది. ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా అసెంబ్లీలో ఈ నెల 24 నుంచి 31 వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్టు కార్యదర్శి నర్సింహాచార్యులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే అసెంబ్లీలోని వారి పార్టీ కార్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని, మాజీ ప్రజాప్రతినిధులకు, మీడియాకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, వారి అడ్వకేట్లు మెబైల్ ఫోన్లు, వాచ్లు ఇతర గ్యాడ్జెట్లను అసెంబ్లీలోకి అనుమతించమని స్పష్టం చేశారు.