చైనా ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది : రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్

చైనా ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది :  రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్
  • పీఎల్ఏ సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు
  • మన సైనికులు వారిని దీటుగా ఎదుర్కొని.. వెనక్కి పంపేశారు
  • ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనా దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడి
  • తవాంగ్ సెక్టార్​లో ఆందోళనపై దద్ధరిల్లిన పార్లమెంట్.. ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా సోల్జర్లను మన ఆర్మీ ధైర్యంగా అడ్డుకున్నదని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ చెప్పారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌‌ఏసీ) వెంబడి జరిగిన ఈ ఘటనపై మంగళవారం లోక్‌‌సభలో సుమోటోగా రాజ్‌‌నాథ్ ప్రకటన చేశారు. ఆపై రాజ్యసభలోనూ ఇలాంటి స్టేట్‌‌మెంట్ ఇచ్చారు. ‘‘ఈ నెల 9న అరుణాచల్‌‌ప్రదేశ్‌‌ తవాంగ్ సెక్టార్‌‌‌‌లోని యాంగ్‌‌ట్సీ ఏరియాలో ఎల్‌‌ఏసీ వెంబడి స్టేటస్‌‌ కోను ఏకపక్షంగా మార్చేందుకు పీఎల్ఏ సైనికులు ప్రయత్నించారు. మన సైనికులు వారిని దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. పీఎల్‌‌ఏ సైనికులు మన భూభాగంలోకి చొరబడకుండా మన సైనికులు అడ్డుకున్నారు.  చైనా సైనికులు తమ స్థానాలకు వెళ్లిపోయేలా చేశారు. ఇండియన్ కమాండర్లు వెంటనే జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ గొడవలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేను సభకు తెలియజేయాలని అనుకుంటున్నా. తీవ్రమైన గాయాలు కూడా ఎవరికీ తగల్లేదు. రెండు వైపులా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి” అని వెల్లడించారు. రాజ్​నాథ్​ సింగ్ ప్రకటన చేయగానే ఈ విషయంపై చర్చ జరగాలంటూ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో రెండు సభలు వాయిదా పడ్డాయి. 12.30 గంటలకు తిరిగి సమావేశాలు ప్రారంభం కాగానే రాజ్​నాథ్​ సింగ్ మాట్లాడారు.

11న ఫ్లాగ్ మీటింగ్

‘‘ఎల్‌‌ఏసీ దగ్గర జరిగిన గొడవ తర్వాత.. ఈ నెల 11న చైనా కమాండర్‌‌‌‌తో స్థానిక ఇండియా కమాండర్ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. చైనా వైపు నుంచి చొరబాటు చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బార్డర్ వెంబడి శాంతిని కాపాడాలని కోరారు” అని రాజ్‌‌నాథ్ వెల్లడించారు. ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనా దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. దేశ భూభాగాలను కాపాడేందుకు మన ఆర్మీ కట్టుబడి ఉందని, చొరబాట్లకు ప్రయత్నించే వారిని దీటుగా అడ్డుకుంటామని ప్రకటించారు. మన సైనికులకు మద్దతు ఇచ్చే విషయంలో సభ మొత్తం ఒక్కతాటిపైకి వస్తుందని తనకు నమ్మకం ఉందని అన్నారు. 

కిందటేడాది కూడా..

2020 జూన్‌‌లో గల్వాన్‌‌ లోయలో ఇండియా, చైనా సోల్జర్ల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరువైపులా యుద్ధ వాతావరణం ఏర్పడింది. తర్వాత అదే ఏడాది ఆగస్టులో ఆగస్టులో తూర్పు లడఖ్‌‌లో సరిహద్దుల్లో  గతేడాది అక్టోబర్‌‌‌‌లో కూడా యంగ్‌‌ట్సీ దగ్గర్లో రెండు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే స్థానిక కమాండర్లు చర్చలు జరిపిన తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు యంగ్‌‌ట్సీ దగ్గరే మరోసారి గొడవ జరిగింది. 

రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్

తవాంగ్ సెక్టార్‌‌‌‌లో గొడవపై రాజ్‌‌నాథ్ చేసిన ప్రకటన విషయంలో క్లారిటీ కావాలని కాంగ్రెస్ చేసిన డిమాండ్‌‌ను రాజ్యసభ తిరస్కరించింది. ఇది సున్నితమైన అంశమని, క్లారిఫికేషన్స్‌‌కు అనుమతివ్వడం కుదరదని డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ చెప్పారు. సెన్సిటివ్ విషయాలపై గతంలోనూ క్లారిఫికేషన్స్‌‌కు అనుమతివ్వలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. దీంతో వివరణ ఇవ్వనప్పుడు తాము సభలో కూర్చొని ఉపయోగమేంటని కాంగ్రెస్ నేతలు అసహనం చేశారు. హస్తం పార్టీ సభ్యులతోపాటు సీపీఐ, సీపీఎం, శివసేన, ఆర్జేడీ,  ఎస్పీ, జేఎంఎం పార్టీల నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. 

ప్రభుత్వం నిజాయితీగా ఉండాలి: ఖర్గే

దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా ఉండాలని, రాజకీయం చేయకూడదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ‘‘చైనా సోల్జర్లు మరోసారి మన సైనికులను రెచ్చగొట్టారు. మన జవాన్లు దీటుగా బదులిచ్చారు. కానీ కొందరు గాయపడ్డారు. జాతీయ భద్రత లాంటి విషయాల్లో మేం దేశం వైపు ఉంటాం. అలాంటి అంశాలను రాజకీయం చేయడం మాకు ఇష్టం లేదు” అని ఖర్గే ట్వీట్ చేశారు. 2020 ఏప్రిల్ నుంచి ఎల్‌‌ఏసీ వెంబడి చైనా అతిక్రమణలకు పాల్పడుతోందని ఈ అంశంపై పార్లమెంట్‌‌లో చర్చించాలన్నారు. మన సైనికుల పరాక్రమానికి, త్యాగానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.