భారత్ హిందూ రాజ్యం కాదు

భారత్ హిందూ రాజ్యం కాదు

బీజేపీ.. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేసే పార్టీ కాదని చెప్పారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ప్రతిపక్షాలే హింసను రెచ్చగొట్టి పబ్బంగడుపుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు తమ విపక్ష ధర్మాన్ని పాటించడం కోసం ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిందేనని భావిస్తే ఆ పని చేయొచ్చన్నారు. కానీ, రాజ నీతిని పాటించడం మర్చిపోవద్దని సూచించారు.  ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకురావడానికి కారణాన్ని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ ముస్లిం రాజ్యాలని, కానీ భారత్ హిందూ రాజ్యం కాదని, సెక్యులర్ దేశమని చెప్పారాయన. ఇండియాలో అన్ని మతాల వారూ సమానమేనని, స్వేచ్ఛగా వారి మతాన్ని పాటించవచ్చని చెప్పారు. కానీ, మన పొరుగు దేశాల్లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు వంటి మైనారిటీలు మత హింసను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అక్కడ బతకలేక భారత్ వచ్చేస్తున్న వారికి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించేందుకు పౌరసత్వ చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. పాకిస్థాన్ లోని ముస్లిం సోదరులు కూడా అక్కడ ఉండలేక భారత్ వచ్చేయాలనుకుంటే ఇక్కడ పౌరసత్వం కల్పించే ప్రొవిజన్ చట్టంలో ఉందని తెలిపారు రాజ్‌నాథ్. గడిచిన ఐదారేళ్లలో 600 మంది పాకిస్థానీ ముస్లింలకు భారత పౌరసత్వం ఇచ్చామని చెప్పారు. అవి తెలిసి కూడా ప్రతిపక్షాలు హింసను రెచ్చగొడుతున్నాయని, ఆయా పార్టీల నేతలు రాజనీతిని మరచి రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు.