వీర సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి

వీర సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి

దేశంలో  ఉగ్రవాదాన్ని మూలాలతో సహా నిర్మూలించడానికి  కృషి చేస్తున్నామని  రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్.. మన దేశంలో  టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. 1971లో  పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఢిల్లీలో ‘స్వర్ణిమ్‌ విజయ్‌ పర్వ్‌’ను ప్రారంభించారు రాజ్‌నాథ్. ఆ యుద్ధంలో వాడిన ఆయుధాలు, పరికరాలను ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వాటిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుకు భారత్ సాయం చేసిందన్నారు. 50 ఏళ్లుగా ఆ దేశం అభివృద్ధి బాటలో ముందుకెళ్తుండడం చూస్తే ఈ రోజు సంతోషంగా అనిపిస్తోందని రాజ్‌నాథ్ చెప్పారు. 1971 యుద్ధంలో ఎంతో మంది భారత వీర సైనికులు వెలకట్టలేని త్యాగాలు చేశారని, వాళ్లందరికీ దేశం ఎప్పటికీ రుణ పడే ఉంటుందని అన్నారు.

కాగా, హెలికాప్టర్‌‌ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ విషాద సమయంలో ‘స్వర్ణిమ్‌ విజయ్ పర్వ్‌’ వేడుకలను హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా నిర్వహించామని రాజ్‌నాథ్ అన్నారు. ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌కు బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్‌లో వైద్యం అందుతోందని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు.