ఎమ్మెల్యే షకీల్‌‌ కొడుక్కి క్లీన్ చిట్‌‌!

ఎమ్మెల్యే షకీల్‌‌ కొడుక్కి క్లీన్ చిట్‌‌!
  •  జూబ్లీహిల్స్‌‌ యాక్సిడెంట్‌‌ కేసులో లొంగిపోయిన నిందితుడు అఫ్నాన్‌‌
  • తనే కారు నడిపినట్లు వాంగ్మూలం.. ఫింగర్‌‌‌‌ ప్రింట్స్ ఆధారంగా నిర్ధారణ
  • ప్రమాద సమయంలో కారులో ముగ్గురు.. అందులో ఎమ్మెల్యే కొడుకు రాహెల్ కూడా 
  • నిందితుల్లో రాహెల్‌‌ పేరు చేర్చలే.. అతడు ఎక్కడున్నాడో తెలియదన్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: జూబ్లీహిల్స్‌‌ యాక్సిడెంట్‌‌ కేసులో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్లు మెహిదీపట్నానికి చెందిన అఫ్నాన్‌‌ అహ్మద్‌‌ (19) ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసుల ముందు స్టేట్‌‌మెంట్‌‌ ఇచ్చాడు. అఫ్నాన్‌‌ సరెండర్‌‌‌‌ కావడంతో బోధన్‌‌ ఎమ్మెల్యే షకీల్‌‌ కొడుకు రాహెల్‌‌ అహ్మద్‌‌కి పోలీసులు క్లీన్‌‌ చిట్‌‌ ఇచ్చారు. గురువారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్‌‌ నంబర్‌‌‌‌ 45లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన కేసు వివరాలను బంజారాహిల్స్‌‌ ఏసీపీ సుదర్శన్‌‌ గౌడ్‌‌ శనివారం వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కారులో ముగ్గురు యువకులు ఉన్నారని, అందులో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారని చెప్పారు. ఫింగర్‌‌ ప్రింట్స్‌‌, సెల్‌‌ఫోన్‌‌ టవర్‌‌‌‌ లొకేషన్‌‌ ఆధారంగా అఫ్నాన్‌‌ డ్రైవ్‌‌ చేసినట్లు 
నిర్ధారించామని వివరించారు.

అందుకే త్వరగా గుర్తించలేకపోయినం

రాహెల్‌‌, అఫ్నాన్‌‌ అహ్మద్‌‌, మహ్మద్‌‌మాజ్‌‌.. బీబీఏ చదువుతున్నారని ఏసీపీ సుదర్శన్‌‌ గౌడ్‌‌ చెప్పారు. ‘‘అంతా కలిసి గురువారం సాయంత్రం 7.30 గంటల టైమ్​లో ఇనార్బిట్‌‌ మాల్‌‌ వెళ్లి,  అక్కడ ఫుడ్‌‌ తిన్నారు. ఎమ్మెల్యే షకీల్‌‌ పేరుతో స్టిక్కర్‌‌ ఉన్న కారులో జూబ్లీహిల్స్‌‌ రోడ్ నంబర్ 45లో వెళ్లారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో కారు స్పీడ్‌‌ సుమారు 40 కి.మీ ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. యాక్సిడెంట్‌‌ జరిగిన సమయంలో అఫ్నాన్‌‌ అహ్మద్‌‌ కార్‌‌‌‌ డ్రైవ్‌‌ చేస్తున్నాడు” అని వివరించారు. అఫ్నాన్ పక్క సీట్లోనే రాహెల్‌‌ కూర్చున్నాడని చెప్పారు. యాక్సిడెంట్‌‌ జరిగినప్పుడు ముగ్గురిపై స్థానికులు దాడి చేశారని, దీంతో వాళ్లు చెరో దిక్కు పారిపోయారని తెలిపారు. ఈ కేసులో నాలుగు టీమ్స్‌‌తో దర్యాప్తు చేశామన్నారు. కారులో ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్‌‌ చేశామని, డ్రైవింగ్‌‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు 100 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని వెల్లడించారు. ముగ్గురూ బ్లాక్ టీ షర్ట్స్‌‌ వేసుకుని ఉండడంతో డ్రైవింగ్‌‌ చేసిన వ్యక్తిని గుర్తించడంలో ఆలస్యం జరిగిందని చెప్పారు.

నిందితుడిని బాధితులు, సాక్ష్యులు గుర్తించిన్రు

శుక్రవారం అఫ్నాన్‌‌ వచ్చి తమ ముందు లొంగిపోయాడని ఏసీపీ తెలిపారు. ముగ్గురు బాధిత మహిళలు, మరో ముగ్గురు సాక్ష్యులు అఫ్నాన్‌‌ను గుర్తించినట్లు తెలిపారు. అఫ్నాన్‌‌ కన్‌‌ఫెషన్‌‌ రిపోర్ట్‌‌ ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండ్‌‌కి తరలించామని పేర్కొన్నారు. రాహెల్‌‌, మహ్మద్‌‌ మాజ్‌‌లను నిందితుల జాబితాలో చేర్చలేదని, రాహెల్‌‌ ఎక్కడున్నాడో కూడా తమకు తెలియదని చెప్పారు. కాగా, బాబు డెడ్​బాడీని మహారాష్ట్ర నుంచి బాధితుల బంధువులు వచ్చి తీసుకెళ్లారని జూబ్లీహిల్స్ ఇన్​స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అఫ్నాన్‌‌, రాహెల్‌‌, మహ్మద్‌‌ మద్యం తాగలేదని భావిస్తున్నామన్నారు.