వర్క్ ఫ్రం జైల్ అని ఇప్పుడే వింటున్నా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​పై రాజ్​నాథ్ ఎద్దేవా

వర్క్ ఫ్రం జైల్ అని ఇప్పుడే వింటున్నా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​పై రాజ్​నాథ్ ఎద్దేవా

చండీగఢ్: వర్క్ ఫ్రం హోం గురించి విన్నా.. కానీ, వర్క్ ఫ్రం జైల్ నుంచి మొదటిసారి వింటున్నానని రక్షణ మంత్రి రాజ్​నాథ్  సింగ్ పరోక్షంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఎద్దేవా చేశారు. ఫతేగఢ్  సాహిబ్  బీజేపీ అభ్యర్థి రామ్ వాల్మీకీకి మద్దతుగా ఆదివారం హర్యానాలోని కన్నాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజ్ నాథ్  మాట్లాడారు. ‘‘ఢిల్లీలో ఆప్  ప్రభుత్వం ఉంది. ఆ పార్టీ లీడర్(కేజ్రీవాల్) లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లాడు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలే వరకు సీఎం పదవికి ఆయన దూరంగా ఉండాలి. అది నైతికత. కానీ, సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచి పనిచేస్తానని ఆయన చెబుతున్నాడు. ఒక సీఎం అలా చెప్పడం ఫస్ట్  టైం వింటున్నా” అని రాజ్​నాథ్  వ్యాఖ్యానించారు.

ఆప్ పార్టీని స్థాపించడంపైనా కేజ్రీవాల్​ను ఆయన విమర్శించారు. ‘‘కాంగ్రెస్  పార్టీ అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ ఉద్యమం నడిపాడు. ఉద్యమాన్ని ఎలాంటి రాజకీయ లాభాపేక్ష కోసం వాడుకోరాదని, ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీ పెట్టరాదని తన గురువు (అన్నా హజారే) కేజ్రీవాల్ కు స్పష్టంగా చెప్పారు. అయినా కూడా తన గురువు మాటను ధిక్కరించి ఆయన పార్టీ పెట్టాడు. అలాగే సీఎం అయిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ వసతులు వాడుకోనని అన్నాడు. కానీ, కోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టి సీఎం నివాసాన్ని ‘శీష్​ మహల్’ గా మార్చాడు” అని రాజ్ నాథ్  మండిపడ్డారు.