అమ్ములపొదిలోకి అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్లు

అమ్ములపొదిలోకి అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్లు
  • శత్రు రాడార్లను బోల్తా కొట్టించే ‘ప్రచండ’
  • లాంఛనంగా భారత వైమానిక దళంలోకి..
  • జోధ్‌పుర్‌లో ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ (LCH)  ‘ప్రచండ్‌’ను భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లాంఛనంగా భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీ, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఇతర సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవాళ నాలుగు హెలికాప్టర్లను వాయుసేనలో ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని ‘ప్రచండ్‌’ ఎల్‌సీహెచ్‌లను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భారత వాయుసేన అధికారులు వెల్లడించారు. 

‘ప్రచండ్‌’ ప్రత్యేకతలు 
* ‘ప్రచండ్‌’ హెలికాప్టర్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) అభివృద్ధి చేసింది. 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తులో ఆయుధాలు, ఇంధనంతో.. భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రచండ్‌ ల్యాండ్ -టేకాఫ్ చేసుకోగలదు. ప్రపంచంలోనే ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం మరో విశేషం. 

* 2020 మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భద్రతా కేబినెట్‌ కమిటీ(CCS).. భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి హెలికాప్టర్లను సమకూర్చేందుకు ఆమోద ముద్ర వేసింది. ముందుగా 15 హెలికాప్టర్ల తయారీ కోసం రూ.3887 కోట్లను కేంద్రం కేటాయించింది. వీటిలో 10 హెలికాప్టర్లు భారత వాయుసేనలోకి, మరో ఐదింటిని ఆర్మీకి కేటాయించారు. 

* 1999 కార్గిల్‌ యుద్ధం తర్వాత తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు అవసరాన్ని గుర్తించిన నేపథ్యంలో వీటిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.

* రెండు ఇంజిన్లు కలిగిన ఈ తేలికపాటి హెలికాప్టర్‌ 5.8టన్నుల బరువు ఉంటుంది.

* గాల్లో క్షిపణి లక్ష్యాలను టార్గెట్‌ చేసే విధంగా ఎయిర్‌ -టు- ఎయిర్‌ గన్స్‌ ప్రచండ్ హెలికాప్టర్‌కు ఉంటాయి.

* 20ఎంఎం టర్రెంట్‌ గన్స్‌, రాకెట్‌ వ్యవస్థతోపాటు ఇతర ఆయుధాలను విడిచే ఏర్పాట్లు ఉన్నాయి.

* యుద్ధ ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు సహా ఎత్తైన పర్వత ప్రాంతాలతో పాటు రాత్రివేళల్లోనూ శత్రు లక్ష్యాలను ఛేదిస్తాయి.

* ప్రచండ్ సమర్థవంతంగా శత్రు నిఘా నుంచి తప్పించుకోగలరు. మందుగుండు సామగ్రిని త్వరగా యుద్ధ ప్రాంతాలకు మోసుకెళ్ళగలదు. 

* శత్రు సైన్యంతో  రాత్రిపూట కూడా ఇది పోరాడగలదు. నేలను బలంగా తాకినా తట్టుకోగల ల్యాండింగ్‌ గేర్‌ను ఏర్పాటు చేశారు. 

* గాల్లో అద్భుత విన్యాసాలు చేస్తూ శత్రువులను గందరగోళానికి గురి చేస్తుంది. 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్, టేక్ ఆఫ్​ కాగలదు.

* తొలిదశలో లద్దాఖ్, జమ్ముకశ్మీర్​లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్లను మోహరించనున్నారు. వీటితో శత్రు దేశ డ్రోన్లు, సైనిక కార్యకలాపాలు, ట్యాంకుల మోహరింపు, బంకర్లపై నిఘా పెరుగుతుందని వైమానిక వర్గాలు పేర్కొన్నాయి.