- 15 నుంచి ప్రైవేట్, ప్రొఫెషనల్ కాలేజీలు బంద్
- ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం నిర్ణయం
- ‘ఫీజు బకాయిలు’ రిలీజ్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ మేనేజ్మెంట్ల అసోసియేషన్లు కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 15 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీతో పాటు ఇతర అన్ని ప్రొఫెషనల్ కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతీ) ప్రకటించింది. 15న ఇంజినీరింగ్స్ డేను.. బ్లాక్ డేగా పాటించాలని డిసైడ్ అయింది.
శుక్రవారం (సెప్టెంబర్ 12) హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్‌కు ఫతీ చైర్మన్ ఎన్. రమేశ్ బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, ట్రెజరర్ కే కృష్ణారావు నేతృత్వంలోని బృందం వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని, వీటిని రిలీజ్ చేయాలని ఏడాదిన్నరగా ప్రభుత్వానికి పలు దఫాలుగా వినతిపత్రాలు అందించినట్టు చెప్పారు.
వీటిలో రూ.1,200 కోట్లకు టోకెన్లు రిలీజ్ చేసినా.. ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదన్నారు. కాలేజీలకు భారీగా బకాయిలు పెరగడంతో, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. దసరా పండుగ నేపథ్యంలో జీతాల కోసం వేలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు రిలీజ్ చేయకపోతే కాలేజీలు నడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీఎస్ రామకృష్ణారావునూ కలిసి వినతిపత్రం అందించారు.
16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల బంద్..
రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలకు రావాల్సిన ఫీజు బకాయిలను రిలీజ్ చేయాలని కోరుతూ ఈ నెల 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలను కూడా బంద్ చేస్తున్నట్టు ఆ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం టీజీసీహెచ్ఈ ముందు మేనేజ్మెంట్ల ప్రతినిధులు నిరసన తెలిపారు. అనంతరం కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందించారు. ఎంప్లాయీస్ కు జీతాలివ్వలేక, భవనాలకు అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
