అహ్మదాబాద్‌కు రెండో బుల్లెట్ ట్రైన్.. 3 గంటల్లో ఢిల్లీకి!

అహ్మదాబాద్‌కు రెండో బుల్లెట్ ట్రైన్..  3 గంటల్లో ఢిల్లీకి!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు రెండో బుల్లెట్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. రైల్వేశాఖ డీపీఆర్ ప్రకారం సబర్మతి స్టేషన్ నుంచి ఢిల్లీకి ఈ ట్రైన్ నడవనున్నట్లు సమాచారం. దీంతో అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గనుంది. ఎలివేటెడ్ కారిడార్‌పై సగటు వేగం 250 కి.మీ ఉంటుందని అధికారులు తెలిపారు.  

ఈ మేరకు రైల్వే శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రతిపాదిత బుల్లెట్ రైలు హిమ్మత్‌నగర్, ఉదయ్‌పూర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, అజ్మీర్, కిషన్‌గఢ్, జైపూర్, రేవారీ, మనేసర్ స్టేషన్ల మీదుగా వెళ్తుంది. కాగా, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ ఫేజ్ 2026కి పూర్తి కానుంది. ప్రస్తుతం దేశంలో  కేవలం ఒక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ - అహ్మదాబాద్ నుండి ముంబై వరకు - నిర్మాణంలో ఉంది. 

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న బీజేపీ తన మేనిఫెస్టోలో ఉత్తర, దక్షిణ, తూర్పు భారతదేశంలో ఒక్కో బుల్లెట్ రైలును నడుపుతామని హామీ ఇచ్చింది. కేంద్రం ఆమోదించిన ఆరు కొత్త హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల ప్రణాళికలో అహ్మదాబాద్-ఢిల్లీ బుల్లెట్ రైలు ఒక భాగం. దేశంలోని రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.