ఢిల్లీలో డేంజర్ స్థాయిలో కాలుష్యం.. ట్రాఫిక్ పై ఆంక్షలు

ఢిల్లీలో డేంజర్ స్థాయిలో కాలుష్యం.. ట్రాఫిక్ పై ఆంక్షలు

ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు: ఢిల్లీ సర్కారు

న్యూఢిల్లీ: తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో ఆ సమస్యను నియంత్రించడానికి కేజ్రీవాల్ సర్కారు మరిన్ని కఠిన చర్యలు తీసుకోనుంది. శనివారం రెండో రోజు కూడా గాలి నాణ్యత డేంజర్ లెవెల్​లో ఉండడంతో కొన్ని వాహనాల రాకపోకలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్లంఘించిన వారికి రూ.20 వేల జరిమానా విధించాలని సర్కారు నిర్ణయించింది.

ట్రాఫిక్​ను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఢిల్లీకి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడంతో వాయు కాలుష్యం మరింత పెరిగిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సఫర్ తెలిపాయి. దీంతో వాయు కాలుష్యం కట్టడికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డీజిల్​తో నడిచే నాన్  బీఎస్ 6 లైట్ మోటార్ వెహికల్స్​పై నిషేధం విధించింది. డీజిల్ ట్రక్కులను కూడా ఢిల్లీలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పింది.

అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులను సప్లై చేసే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. అలాగే సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులు ఢిల్లీలో ప్రవేశించేందుకు అనుమతిచ్చామని  రవాణా శాఖ అధికారులు చెప్పారు. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ లైట్ మోటార్ వెహికల్స్ కూడా రోడ్డు ఎక్కేందుకు వీలులేదని తెలిపారు. ఇక పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మరో వెయ్యి సీఎన్జీ బస్సులను 60 రోజులపాటు అద్దెకు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, ఢిల్లీని శనివారం పొగమంచు కప్పేసింది. వరుసగా మూడోరోజు కూడా గాలిలో నాణ్యత సివియర్ కేటగిరిలోనే ఉండిపోయింది.