న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట కారు బాంబ్ పేలుడు కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్‌ను సోమవారం (నవంబర్ 17) శ్రీనగర్‌లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడు, ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో డానిష్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
బాంబ్ పేలుడు కోసం ఉమర్ నబీకి డానిష్ సాంకేతిక సహయం అందించాడని.. డ్రోన్ల ద్వారా ఉగ్రవాద దాడులకు సహకరించాడని సమాచారం. ఉగ్రదాడుల కోసం డ్రోన్లలో మార్పులు చేర్పులు చేయడంతో పాటు రాకెట్లను కూడా తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా, 2025, నవంబర్ 11న భారీ పేలుడుతో దేశరాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది.
