DC vs KKR: ఐపీఎల్ (IPL 2026) లీగ్ స్టేజ్ ఆఖరి పోరులో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 203 పరుగులు చేయగా.. 204 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ టీమ్‌ను ఢిల్లీ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. కోల్‌కతా బ్యాటర్లు గట్టిగా పోరాడినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే 163 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ 40 పరుగుల తేడాతో ఘన విజయంతో లీగ్ చివరి మ్యాచ్ ని ముగించింది.
కుల్దీప్ యాదవ్ దెబ్బ:
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అజింక్య రహానే, ఫిన్ అలెన్ క్రీజులో నిలదొక్కుకుని స్కోరు బోర్డును పరిగెత్తించారు. కానీ, వీరిద్దరి మధ్య నెలకొన్న 43 పరుగుల భాగస్వామ్యానికి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్రేక్ వేసిండు. ప్రమాదకరంగా మారుతున్న ఫిన్ అలెన్ (20)ను కుల్దీప్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ చేశాడు.
మనీష్ పాండే ఫైట్.. కుల్దీప్ షాక్:
అలెన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే కాసేపు దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, టీమ్ స్కోరు 87 పరుగుల వద్ద ఉన్నప్పుడు లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి మనీష్ పాండే పెవిలియన్‌కు చేరాడు. ఆ వెంటనే కేకేఆర్‌కు కుల్దీప్ యాదవ్ కోలుకోలేని బిగ్ షాక్ ఇచ్చిండు. కిరాక్ బౌలింగ్‌తో విరుచుకుపడిన కుల్దీప్.. కామెరాన్ గ్రీన్ (2), రింకు సింగ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి నైట్ రైడర్స్ నడుము విరిచేశాడు.
స్టార్క్ విధ్వంసం:
వరుస వికెట్లతో కష్టాల్లో పడ్డ కేకేఆర్‌ను కోలుకోకుండా చేయడంలో కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. క్రీజులోకి వచ్చిన తేజస్వి దహియాను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ వైపుకు తిరిగింది. ఇక ఆఖర్లో 18వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ తన పేస్‌తో మాయ చేశాడు. ఆ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు (రోవ్‌మన్ పావెల్ రనౌట్ తో పాటు అనుకూల్ రాయ్, కార్తీక్ త్యాగి) అవుట్ చేసి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. ఢిల్లీ బౌలర్ల కిరాక్ ప్రదర్శనతో 163 రన్స్‌కే కేకేఆర్ ఆలౌట్ అవ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆఖరి మ్యాచ్‌లో 40 రన్స్ తేడాతో గెలిచి సీజన్‌ను ముగించింది.
