ఢిల్లీ క్యాపిటల్స్ కమాల్.. రాజస్తాన్ రాయల్స్ ఢమాల్

ఢిల్లీ క్యాపిటల్స్ కమాల్.. రాజస్తాన్ రాయల్స్ ఢమాల్

బలం, బలగం సమానంగా ఉన్న రెండు జట్ల పోరాటంలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ పైచేయి సాధించింది..! బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో సమయానుకూలంగా రాణించి… రాజస్తాన్‌‌ రాయల్స్‌‌కు చెక్‌‌ పెట్టింది..! దీంతో వరుసగా మూడో విజయంతో మళ్లీ టేబుల్‌‌ టాపర్‌‌ గా నిలిచింది..! మరోవైపు మ్యాచ్‌‌ల సంఖ్య పెరుగుతు న్నా.. రాజస్తాన్‌‌ పెర్ఫామెన్స్‌‌లో మాత్రం మార్పు రావడం లేదు..! లీగ్‌‌ ఆరంభంలో మెరుపులు మెరిపించిన వీరులందరూ పెవిలియన్‌‌కు క్యూ కట్టడంతో వరుసగా నాలుగో ఓటమి తప్పలేదు..!!

షార్జాఐపీఎల్‌‌–13లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ దూసుకుపోతున్నది. బ్యాటింగ్‌‌లో హెట్‌‌మయర్‌‌ (24 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 5 సిక్సర్లతో 45), స్టోయినిస్‌‌ (30 బాల్స్‌‌లో 4 సిక్సర్లతో 39) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ 46 రన్స్‌‌  తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌పై గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 185 రన్స్‌‌ టార్గెట్‌‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్‌‌ 19.4 ఓవర్లలో 138  రన్స్‌‌కే ఆలౌటైంది.  రాహుల్‌‌ తెవాటియా (29 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) టాప్‌‌ స్కోరర్‌‌. అశ్విన్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది.

కళ్ల ముందు భారీ టార్గెట్‌‌ ఉన్నా.. రాయల్స్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ ఓపిక చూపలేకపోయారు. 15 రన్స్‌‌కే బట్లర్‌‌ (13) ఔటైనా, యశస్వి జైస్వాల్‌‌ (36 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 34), కెప్టెన్‌‌ స్మిత్‌‌ (24) కాసేపు పోరాడారు. రెండో వికెట్‌‌కు 41 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ 9వ ఓవర్‌‌లో అన్రిచ్… దెబ్బకు స్మిత్‌‌ ఔట్‌‌కావడంతో మొదలైన వికెట్ల పతనం చివరి వరకు సాగింది. మధ్యలో తెవాటియా ఫోర్లు, సిక్సర్లతో భయపెట్టినా.. ఢిల్లీ బౌలర్లు అశ్విన్‌‌ (2/22), స్టోయినిస్‌‌ (2/17) దెబ్బకు మిడిలార్డర్‌‌లో శాంసన్‌‌ (5), లోమ్రోర్‌‌ (1), జైస్వాల్‌‌,  టై (6), ఆర్చర్‌‌ (2), గోపాల్‌‌ (2) వరుస విరామాల్లో పెవిలియన్‌‌కు చేరారు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో 49 రన్స్‌‌ కావాల్సిన దశలో తెవాటియా ఔట్‌‌కావడంతో  ఢిల్లీ మరో రెండు బాల్స్‌‌ ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. రబాడ మూడు వికెట్లు తీసి రాజస్తాన్‌‌ ఓటమిని శాసించాడు.

ఇద్దరే.. ఇద్దరు

అంతకుముందు టాస్‌‌ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 184/8 స్కోరు చేసింది.  ఓపెనర్లు పృథ్వీ (19), ధవన్‌‌ (5) నిరాశపర్చినా.. వన్‌‌డౌన్‌‌లో కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (22) ఫర్వాలేదనిపించాడు. దీంతో  పవర్‌‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 51/3 స్కోరు చేసింది. అయితే ఆరంభంలో అద్భుతమైన బౌలింగ్‌‌తో ఆకట్టుకున్న ఆర్చర్‌‌ (3/24) చివర్లోనూ సక్సెస్‌‌ అయ్యాడు.  ఇన్నింగ్స్‌‌ను నిర్మించే బాధ్యత తీసుకున్న రిషబ్‌‌ (5), స్టోయినిస్‌‌ జోరు చూపెట్టారు. గోపాల్‌‌ వేసిన 7వ ఓవర్‌‌లో స్టోయినిస్‌‌ వరుస సిక్సర్లతో రెచ్చిపోయాడు. తర్వాతి ఓవర్‌‌లో తెవాటియా కాస్త కంట్రోల్‌‌ చేసినా.. ఆ వెంటనే (9వ ఓవర్‌‌) స్టోయినిస్‌‌ మరో సిక్సర్‌‌ కొట్టాడు. కానీ 10వ ఓవర్‌‌లో ఢిల్లీకి మరో షాక్‌‌ తగిలింది. లేని రన్‌‌ కోసం ప్రయత్నించిన పంత్‌‌ అనూహ్యంగా రనౌట్‌‌కావడంతో నాలుగో వికెట్‌‌కు 29 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. స్టోయినిస్‌‌ మాత్రం తగ్గలేదు. తర్వాతి బాల్‌‌ను స్టాండ్స్‌‌లోకి పంపడంతో తొలి పది ఓవర్లలో ఢిల్లీ 87 రన్స్‌‌ చేసింది. రెండో ఎండ్‌‌లో హెట్‌‌మయర్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించినా, హర్షల్‌‌ పటేల్‌‌ (16)ను కట్టడి చేయడంలో రాజస్తాన్‌‌ బౌలర్లు సక్సెస్‌‌ అయ్యారు. మూడు ఓవర్లలో వరుసగా 5, 4, 11 రన్సే ఇవ్వడంతో పాటు 14వ ఓవర్‌‌లో 4 రన్స్‌‌ ఇచ్చి స్టోయినిస్‌‌ను ఔట్‌‌ చేసి షాకిచ్చారు. హెట్‌‌మయర్‌‌ సిక్స్‌‌తో 15 ఓవర్లు ముగిసేసరికి డీసీ స్కోరు 122/5కి పెరిగింది. 16వ ఓవర్‌‌లో 4, 6 బాదిన హెట్‌‌మయర్‌‌.. తర్వాతి  ఓవర్‌‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. కానీ అదే ఊపులో మరో భారీ షాట్‌‌కు యత్నించి లాంగాన్‌‌లో తెవాటియా చేతికి చిక్కడంతో  ఆరో వికెట్‌‌కు 40 రన్స్‌‌ పార్ట్​నర్​షిప్​ ముగిసింది. చివర్లో అక్షర్‌‌ పటేల్‌‌ (17) ధాటిగా ఆడి ఔట్‌‌కాగా, లాస్ట్‌‌ మూడు ఓవర్లలో 35 రన్స్‌‌ రావడంతో ఢిల్లీ మంచి టార్గెట్‌‌ను నిర్దేశించింది.