
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. లేటెస్ట్ గా ఒక పాత వీడియోకు సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ధనుష్‌తో డేటింగ్ వార్తలు ముగియగానే, ఆమె గతంలో బాలీవుడ్ నటి బిపాసా బసుపై చేసిన కొన్ని వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె బిపాసాను ఉద్దేశించి చేసిన "బాడీ షేమింగ్" కామెంట్లు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి.
దీంతో మృణాల్ ఠాకూర్ తన తప్పును అంగీకరిస్తూ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్షమాపణలు చెప్పింది. నేను 19 ఏళ్ల వయసులో చాలా సిల్లీగా మాట్లాడాను. అది సరదాగా చేసిన వ్యాఖ్యలే కానీ, అవి ఇంతమందిని బాధిస్తాయని నేను అప్పుడు గ్రహించలేకపోయాను. నా మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని ఆమె పేర్కొంది. ఎవరినీ బాడీ షేమింగ్ చేయాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, ఇంటర్వ్యూలో ఆ మాటలు కేవలం ఒక జోక్‌గా మాత్రమే చెప్పానని మృణాల్ వివరించింది. ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఇప్పుడు తాను భావిస్తున్నానని కూడా మృణాల్ ఠాకూర్ ఒప్పుకుంది.
కాలం గడిచేకొద్దీ అందం అంటే ఏంటో నాకు అర్థమైంది. అది కేవలం బయటి రూపం మాత్రమే కాదు, మన మనసులోని సౌందర్యం కూడా. నిజమైన అందం మన మనసులో ఉంటుంది. నేను ఈ విషయం అందరికీ చెప్పదలుచుకున్నాను అంటూ మృణాల్ ఠాకూర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ విషయంలో మృణాల్ పశ్చాత్తాపంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు తమ తప్పులను ఒప్పుకోవడానికి వెనుకాడిన సమయంలో, మృణాల్ క్షమాపణలు చెప్పడం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని అభిమానులు అంటున్నారు.
'సీతారామం', 'జెర్సీ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మృణాల్, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె ఇటీవల అజయ్ దేవగణ్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఐదారు చిత్రాలు ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన కూడా నటిస్తోంది.