స్టేజ్ పైకి పిలవలేదని జాయింట్ కలెక్టర్ను ఉరిమి చూసిన కడప ఎమ్మెల్యే !

స్టేజ్ పైకి పిలవలేదని జాయింట్ కలెక్టర్ను ఉరిమి చూసిన కడప ఎమ్మెల్యే !

కడప: వైఎస్సార్ కడప జిల్లాలో ప్రజాప్రతినిధికి, అధికారులకు మధ్య ప్రోటోకాల్ విషయంలో వివాదం నెలకొంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా మరోసారి ఈ విషయంలో రచ్చ జరిగింది. కడపలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా.. ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్పై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

జాయింట్ కలెక్టర్పై ఎమ్మెల్యే కళ్లెర్ర చేసి గుడ్లు ఉరిమి చూశారు. స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేను స్వయంగా జిల్లా కలెక్టర్ కోరినా అందుకు ఆమె ససేమిరా అన్నారు. నిల్చునే నిరసన వ్యక్తం చేశారు.

అర గంట పైగా నిల్చొని ఆ తర్వాత అక్కడ నుంచి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వెనుదిరిగారు. ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన సమయంలో ముఖ్య అతిథి మంత్రి ఫరూక్తో పాటు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అతిధి సింగ్ స్టేజీపై కూర్చుని ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకు స్టేజ్పై అనుమతి లేదని, కానీ కుర్చీ వేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని స్థానిక వైసీపీ నేతలు ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేశారు.