
- ఎలాంటి ముప్పునైనా శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఎదుర్కొంటం
- న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదు
- సింధూ జలాల నుంచి చుక్క నీరివ్వం
- ప్రపంచ మార్కెట్‌ను ఇండియా శాసిస్తది
- రైతు వ్యతిరేక విధానాలకు అడ్డు గోడ లెక్క నిలబడ్తా
- జీఎస్టీ తగ్గించి దీపావళి ఆనందాన్ని రెట్టింపు చేస్తా
- ఎర్రకోట వేదికగా ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం
- పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభం
న్యూఢిల్లీ: ఎలాంటి ముప్పునుంచైనా దేశాన్ని రక్షించేందుకు వీలుగా శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ‘సుదర్శన్ చక్ర’ అనే అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 2035 నాటికి, ఈ రక్షణ కవచం రెడీ అవుతుందని చెప్పారు. దేశంలో అత్యంత కీలక ప్రదేశాలను ‘సుదర్శన్ చక్ర’ కాపాడుతుందని ఆయన అన్నారు. ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. 103 నిమిషాల పాటు ప్రసంగించారు. జీఎస్టీ విధానంలో సంస్కరణలు తెస్తున్నామని, వచ్చే దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకువస్తుందని తెలిపారు. ఈ సంస్కరణలతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి, ప్రజలకు రిలీఫ్ కలుగుతుందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ తన ప్రసంగం మధ్య మధ్యలో కవితలు చదివారు.
దేశంలోని యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ అనే పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పంద్రాగస్టు నుంచే ఇది అమల్లోకి వస్తున్నదని తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఫస్ట్ టైమ్ జాబ్‌లో చేరిన యువతకు రూ.15వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్, అమెరికా విధించిన టారిఫ్‌లను ఉద్దేశిస్తూ పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అణు దాడుల బెదిరింపులకు ఇండియా భయపడదని తేల్చి చెప్పారు. సింధూ జలాల ఒప్పందానికి తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.
అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను ఉద్దేశిస్తూ ట్రంప్‌పై పరోక్షంగా సంచలన కామెంట్లు చేశారు. కొందరు ఇండియాను తక్కువ చేసి మాట్లాడుతున్నారని, అవేమీ పట్టించుకోవద్దన్నారు. అనవసరమైన విషయాలపై స్పందిస్తూ టైమ్ వేస్ట్ చేయొద్దని, హిస్టరీ క్రియేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రపంచ మార్కెట్‌ను ఇండియా ఏలాలని ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. రైతులు, మత్స్యకారుల ఆసక్తులను అన్ని విధాలుగా రక్షిస్తామన్నారు. వారి సంక్షేమం కోసం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు తాను ఓ గోడలా అడ్డు నిలబడ్తానని భరోసా ఇచ్చారు.
సుదర్శన చక్రలో టార్గెట్ సిస్టమ్.. మోడ్రన్ వెపన్స్
మిషన్ సుదర్శన్ చక్ర దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనున్నదని మోదీ అన్నారు. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కీలక ప్రదేశాలను సేఫ్‌గా ఉంచడంలో ‘సుదర్శన చక్ర’ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ‘‘మహాభారతంలోని శ్రీ కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత కాలంలో దేశంలోని కీలకమైన మౌలిక వసతులను ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. దేశంలో సాంకేతికత అభివృద్ధి విషయంలో విదేశాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. 2008 ముంబై దాడులు భద్రతాపరమైన సవాళ్లను మన ముందుంచాయి. దాడులు జరిగినప్పుడు స్పందించేలా కాకుండా.. ముందే సంసిద్ధతతో ఉండాలి. పదేండ్ల కింద రక్షణరంగంలో స్వయంసమృద్ధిపై మన దేశం దృష్టిపెట్టింది. ఇప్పుడు దాని ఫలితాలు చూస్తున్నాం. మిషన్ సుదర్శన చక్రలో కచ్చితమైన టార్గెట్ సిస్టమ్, మోడ్రన్ వెపన్స్ ఉంటాయి. ఇది శత్రువుల దాడిని అడ్డుకునేందుకు.. సుదర్శన్ చక్రం మాదిరి ప్రతీకార దాడుల్ని తిప్పికొడుతుంది’’ అని మోదీ అన్నారు.
మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి
అమెరికా టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో కొందరు ఇండియాను తక్కువ చేసి మాట్లాడుతున్నారని మోదీ ఫైర్ అయ్యారు. హిస్టరీ క్రియేట్ చేయాల్సిన టైమ్ వచ్చిందని తెలిపారు. ‘‘మనం ప్రపంచ మార్కెట్‌ను ఏలాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. నాణ్యమైన ప్రొడక్ట్స్‌తో ప్రపంచ మార్కెట్‌లో మన సామర్థ్యమేంటో నిరూపించుకోవాలి. దానికి ఇదే కరెక్ట్ టైమ్. మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై ఫోకస్ పెట్టాలి. మన అభివృద్ధిని ప్రపంచం గమనిస్తున్నది. ప్రభుత్వ విధానాల్లో మార్పులకు సలహాలు ఇవ్వండి. రైతుల సమస్యలపై రాజీపడే ప్రసక్తే లేదు. మన రైతులకు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి విధానాలకైనా నేను ఓ గోడలా అడ్డు నిలబడతా. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడతారు. అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు.
జీఎస్టీలో సంస్కరణల కోసం హైపవర్ కమిటీ
జీఎస్టీ విధానంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురానున్నట్లు మోదీ ప్రకటించారు. ‘‘జీఎస్టీలో తీసుకొచ్చే సంస్కరణలు.. సామాన్యుడిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీపావళి నాటికి రేట్లు తగ్గించి ఫెస్టివల్ హ్యాపీనెస్‌ను డబుల్ చేస్తా. గడిచిన 8 ఏండ్లలో జీఎస్టీ విషయంలో మా ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీలో సంస్కరణలు చేస్తాం. సామాన్యులకు ప్రయోజనం కలిగేలా రోజువారి వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకొస్తాం. సంస్కరణల విషయంలో మాకు మద్దతు పలకాలి’’అని మోదీ దేశ ప్రజలను కోరారు.
టెర్రరిజం.. మానవాళి మనుగడకే ముప్పు
టెర్రరిజం.. మానవాళి మనుగడకే ముప్పు అని ప్రధాని మోదీ అన్నారు. పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. ‘‘పహల్గాం దాడితో యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. దానికి సమాధానమే ఆపరేషన్ సిందూర్. దేశంలో హైపవర్డ్ డెమోగ్రఫీ మిషిన్‌ను అమలుచేయనున్నాం. చొరబాటుదారులు భూమి లాక్కోకుండా చూడటమే దీని లక్ష్యం. ముఖ్యంగా ఆదివాసీల భూములను లక్ష్యంగా చేసుకొంటున్నారు. ఇకపై వారి ఆటలు సాగనీయం. సముద్రంలో సహజవనరులు, గ్యాస్, చమురు అన్వేషణకు వీలుగా నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషిన్ ప్రారంభించనున్నాం. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర దేశానికి గర్వకారణం. గగన్‌యాన్ మిషన్ కోసం ఇండియా వేగంగా సిద్ధం అవుతున్నది’’ అని మోదీ అన్నారు. త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్‌లు మార్కెట్‌లోకి తీసుకొస్తామని తెలిపారు.
సింధూ జలాలు మావే.. ఇచ్చేదే లేదు
ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరించారు. పాక్ పదే పదే చేస్తున్న అణు బెదిరింపులకు ఇండియా భయపడదని తేల్చి చెప్పారు. ‘‘నీరు, రక్తం కలిసి ప్రవహించవని మళ్లీ చెబుతున్నా. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదు. వాటిని మా భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదు. వాటిపై పూర్తి అధికారం మాది.. మా రైతులదే. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తాం. సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదు” అని అన్నారు. 2047 నాటికి ఇండియాను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ‘స్పెషల్ రిఫార్మ్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంధనం విషయంలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి వైపు నడిపించాల్సి ఉందన్నారు.
స్వాతంత్ర్య ప్రసంగాల్లో.. మోదీ రికార్డు
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయం ప్రసంగం చేసిన ప్రధానిగా మోదీ ఘనత సాధించారు. జెండా వందనం తర్వాత 103 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. 2024లో 98 నిమిషాలతో నెలకొల్పిన రికార్డును ఈ ఏడాది బ్రేక్ చేశారు. 2017లో అతి తక్కువగా 56 నిమిషాలు మాట్లాడారు. ఎర్రకోట నుంచి వరుసగా 12 సార్లు స్పీచ్ ఇచ్చి అత్యధికసార్లు ప్రసంగించిన ప్రధానులలో రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఉన్నారు. నెహ్రు వరుసగా 17 సార్లు ప్రసంగించారు.