వనపర్తి/కొత్తకోట/మదనాపురం, వెలుగు: వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీలో చైర్పర్సన్ అభ్యర్థిత్వం ఖరారయ్యింది. కొత్తకోట మున్సిపల్ చైర్పర్సన్ గా అరుణ ను అంగీకరిస్తూ కౌన్సిలర్లు శనివారం నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది గెలుపొందగా, ముగ్గురు బీఆర్ఎస్, ఒకరు బీజేపీ, ఒకరు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్‌పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో చైర్ పర్సన్ పీఠం కోసం అరుణ, పల్లవి పోటీ పడ్డారు.
చర్చల అనంతరం కౌన్సిలర్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో అరుణను చైర్ పర్సన్‌గా, పల్లవిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అరుణశ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉందని, భవిష్యత్‌లో మున్సిపాలిటీని రెండింతల అభివృద్ధి చేసేలా చూస్తానన్నారు.
అమరచింతలో సగం.. సగం..!
మున్సిపల్ ఎన్నికల్లో అమరచింత మున్సిపాలిటీలో చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మున్సిపాలిటీలో 10 వార్డు స్థానాలున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు 3 స్థానాల చొప్పున రాగా, సీపీఎంకు ఒక స్థానం దక్కింది. సీపీఎం కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండడంతో కాం గ్రెస్‌కు నాలుగు స్థానాలున్నట్లయ్యింది.
మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఆరు స్థానాలు కావాలి. కాగా, ఇప్పటికే బీజేపీ ముగ్గురు కౌన్సిలర్లను ఎంపీ డీకే అరుణ చొరవతో క్యాంపునకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ముగ్గురు కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి క్యాంపునకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ సీపీఎం మిత్రపక్షాల కూటమికి నాలుగు కౌన్సిలర్లు ఉన్నారు. మంత్రి శ్రీహరి ఎక్స్అఫీషియో ఓటు వేసినా కాంగ్రెస్‌కు అయిదు స్థానాలే అవుతాయి.
అదే ఎంపీ డీకే అరుణ బీజేపీకి ఓటిచ్చినా నాలుగు స్థానాలే అవుతాయి. రెండు పార్టీల్లో ఒకరికి చైర్ పర్సన్ స్థానం ఇస్తామని, కాం గ్రెస్‌కు మద్దతు తెలపాల్సిందిగా కోరినట్లు, దానికి ఆ పార్టీలు ఒప్పుకోలేదని తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఐదేండ్ల పదవి కాలాన్ని రెండున్నర సంవత్సరాల చొప్పున పాలించేలా ఒప్పందం చేసుకున్నారనే చర్చ నడుస్తోంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతనిధ్యం వహించే మక్తల్ నియోజకవర్గం లో వనపర్తి జిల్లాలోని అమరచింత ఆత్మకూరు మున్సిపాలిటీలున్నాయి. ఆత్మకూరు, మక్తల్‌లో క్లియర్ మెజారిటీ రావడంతో అక్కడ ఎలాంటి టెన్షన్ లేదు.
