క్రీడలతో నాయకత్వ లక్షణాలు : కలెక్టర్ కుమార్ దీపక్

క్రీడలతో నాయకత్వ లక్షణాలు : కలెక్టర్ కుమార్ దీపక్
  •     కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడుతాయని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాలలోని స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ పోటీలకు శనివారం జిల్లా యువజన క్రీడా సేవల అధికారి గుర్రాల హనుమంత రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి అధికారులతో కలిసి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందన్నారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని, ప్రశాంతత అలవాటవుతుందన్నారు. ఈ జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి దాదాపు 400 మంది 
క్రీడాకారులు హాజరయ్యారని.. అథ్లెటిక్స్, బాస్కెట్​బాల్, జిమ్నాస్టిక్స్, రూలర్ స్కేటింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, సైక్లింగ్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మందమర్రిలో పోటీలు ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు: క్రీడల వల్ల పోటీతత్వమే కాకుండా నాయకత్వ లక్షణాలు, ఆత్మసైర్యం పెంపొందుతుందని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. మందమర్రిలోని సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో నిర్వహించిన జిల్లాస్థాయి సీఎం కప్​ పోటీలను ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్​ ఏఈ దుర్గాప్రసాద్, మందమర్రి సీఐ పర్స రమేశ్, టౌన్​ఎస్సై గోపతి నరేశ్, క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.