నారాయణపేటలో మున్సి పాల్టీని దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు!

నారాయణపేటలో మున్సి పాల్టీని దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు!
  •     చైర్​ పర్సన్​ న్​ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్​, బీజేపీ మధ్య పోటాపోటీ

మహబూబ్​నగర్​, వెలుగు : నారాయణపేట మున్సిపాల్టీని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్​ ఏర్పడింది. దీంతో ఇతరుల మద్దతుతోనే చైర్మన్​ పీఠాన్ని దక్కించుకోవాల్సి రావడంతో రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ఇప్పటికే క్యాంపులకు తరలించాయి. 

అయితే ఇండిపెండెంట్​గా పోటీ చేసి గెలిచిన బీజేపీ రెబల్​ అభ్యర్థి జయశ్రీ ఆ పార్టీకే మద్దతు తెలిపారు. శనివారం ఉదయం ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచంద్​రావు సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. దీంతో  బీజేపీ కౌన్సిలర్ల బలం 11గా ఉండగా, ఆమె చేరికతో 12కు చేరింది. అయితే ఈ మున్సిపాల్టీలో 24 వార్డులు ఉండగా, చైర్​ పర్సన్​ పీఠాన్ని దక్కించుకోవాలంటే మ్యాజిక్​ ఫిగర్​ 13 కౌన్సిలర్​ స్థానాలు అవసరం. 

ఇప్పటి వరకు బీజేపీకి 12  కౌన్సిలర్​ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మిగతా వారి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఫలితాలు దక్కడం లేదు. ఈ క్రమంలో ముందస్తుగా మహబూబ్​నగర్ ఎంపీ డీకే అరుణ ఎక్స్​-ఆఫీషియో ఓటు కోసం అప్లికేషన్​ పెట్టుకున్నారు. దీంతో ఆమె ఓటు హక్కును వినియోగించుకుంటే ఆ పార్టీ బలం 13కు చేరుకుంటుంది. కానీ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన బడా నేత ఎంటర్​ కావడంతో సమీకరణలు మారుతున్నాయి. ఈ మున్సిపాల్టీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఖాతాలోకి వెళ్లరాదని ఆయన పావులు కదుపుతున్నట్లు తెలిసింది. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఏడు కౌన్సిలర్​ స్థానాలు రాగా, రెండు స్థానాల్లో ఎంఐఎంకు మద్దతు ఇచ్చి గెలిపించుకుంది. ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ నుంచి పోటీ చేసి గెలుపొందిన మరో అభ్యర్థి మద్దతూ కూడగట్టుకుంది. దీంతో ఈ ముగ్గురిని కలుపుకొని కాంగ్రెస్​కు 10 మంది కౌన్సిలర్ల బలం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముగ్గురు కాంగ్రెస్​ శిబిరంలోనే ఉన్నారు. అయితే బడా నేత బీఆర్​ఎస్​కు చెందిన ఇద్దరు కౌన్సిలర్ల మద్దతును కూడగట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన నియోజకవర్గ లీడర్​తో మాట్లాడినట్లు సమాచారం. 

వీరిద్దరి మద్దతును కూడగడితే కాంగ్రెస్​కు 12 కౌన్సిలర్ల బలం చేకూరుతుంది. దీంతో బడా నేత ముందస్తుగా స్థానిక ఎమ్మెల్యే పర్ణికా రెడ్డిని ఎక్స్​ ఆఫీషియో కోసం అప్లికేషన్​ పెట్టుకోవాలని చెప్పడంతో ఆమె ఈ ఓటు కోసం అప్లికేషన్​ పెట్టుకుంది. ఆమె ఓటు హక్కును వినియోగించుకుంటే కాంగ్రెస్​కు 13 ఓట్ల బలం లభిస్తుంది. అలాగే బీజేపీకి కూడా 13 మంది బలం చేకూరుతుంది. దాంతో టాస్​ ద్వారానే చైర్​పర్సన్​ పీఠాన్ని  లక్కీగా ఎవరు దక్కించుకుంటారోననే చర్చ నడుస్తోంది.