
వందల చిత్రాలలో నటించి , వెండితెరపై ప్రతినాయకుడిగా తనదైన ముద్రవేసిన నటుడు పొన్నాంబళం. తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం, హిందీ చిత్రాల్లో ఒక భయంకరమైన విలన్ గా పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, పవన్ కల్యాణ్, విజయ్, అజిత్, శరత్‌కుమార్, సత్యరాజ్, విజయకాంత్, మోహన్ లాల్ , సురేష్ గోపి, మమ్ముట్టి, అంబరీష్, వంటి స్టార్ హీరోల చిత్రాలలో పొన్నాంబళం కీలక పాత్రలు పోషించారు. అతని ఆకర్షణీయమైన శరీరాకృతి, కండలు తిరిగిన దేహం అతన్ని విలన్ పాత్రలకు సరైన ఎంపికగా మార్చాయి. 'నాయక్' సినిమాలో రంగ పాత్రలో, సునీల్ శెట్టి సరసన 'రక్షక్'లో హిందీ ప్రేక్షకులకు కూడా అతను సుపరిచితమే.
పొన్నాంబళం తన సినీ ప్రయాణాన్ని స్టంట్‌మెన్‌గా ప్రారంభించారు. ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాలను ఏ మాత్రం గాయాలు లేకుండా చేసేవారు. ఈ సాహసానికి గాను పరిశ్రమలో అతనికి 'స్పేర్ పార్ట్స్' అనే పేరు వచ్చింది. 1988లో 'కలియుగం' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'అపూర్వ సాగోధరర్గళ్', 'వెట్రి విజా', 'మైఖేల్ మదనా కామ రాజన్', 'మన్నవ కావల్' వంటి అనేక తమిళ హిట్ చిత్రాలలో నటించారు. తెలుగులో ఘారానా మొగుడు, రౌడీ మొగుడు, హిట్లర్, పవిత్ర ప్రేమ, చెన్నకేశవ రెడ్డి, ఎదురులేని మనిషి వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించారు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఒకే సంవత్సరంలో పది చిత్రాలలో నటించారు.
అయితే క్రమేనా సినిమా ఆఫర్స్ తగ్గడంతో దీర్ఘకాలిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయారు పొన్నాంబళం . మానసికంగా దెబ్బతిని మద్యపానానికి బానిసగా మారాడు. దీంతో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 2021 నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ అనేది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన శిక్ష అని పొన్నాంబళం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగు సంవత్సరాలలో రోజు మార్చి రోజు 750 సార్లు నా శరీరం లో ఇంజెక్షన్లు వేయించుకున్నాను. నేను ఉప్పు తినలేను. కడుపు నిండా భోజనం చేయలేను. నా శత్రువులకు కూడా ఈ కష్టం రాకూడదు, అనుభవించకూడదు అని పొన్నాంబళం కన్నీళ్లు పెట్టుకున్నారు.
►ALSO READ | Rajinikanth@50 : రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. బస్ కండక్టర్ నుండి సూపర్ స్టార్ వరకు ఎలా?
ఈ కష్టకాలంలో కొందరు సినీ ప్రముఖులు ఆయనకు అండగా నిలిచారని పొన్నాంబళం తెలిపారు. ఒకప్పుడు సెట్‌లో మా మధ్య జరిగిన గొడవను కూడా పట్టించుకోకుండా చిరంజీవి ఆర్థికంగా సహాయం చేశారని చెప్పారు. నేను అడగ్గానే ఒకటో , రెండు లక్షల రూపాయలు సాయం చేస్తారని భావించా.. కానీ నా వైద్యానికి అయ్యే రూ. 40 లక్షలు ఆయనే ఇస్తారని ఊహించలేదు. ఇప్పటి వరకు కోటి రూపాయల వరకు సాయం చేశారని వెల్లడించారు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. తమిళ ఇండస్ట్రీలో శరత్ కుమార్ ధనుష్, అర్జున్ కూడా తోడ్పాటు అందించారని చెప్పారు. నా ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని భారీగా ఆర్థిక సహాయం చేసి మంచి మనసు చాటుకున్న చిరంజీవికి రుణపడి ఉంటానని అన్నారు.
వివాహ బంధంలో గత 25 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ.. ఈ అనారోగ్యాన్ని ఒంటరిగానే ఎదుర్కొంటున్నాని పొన్నంబళం తెలిపారు. నా కుటుంబాన్ని ఎప్పుడు ఆసుపత్రికి పిలవలేదు. ఒంటిగానే జీవిస్తున్నానంటూ భావోధ్వేగానికి గురయ్యారు. మద్యానికి బానిస కావద్దు.. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని అని సూచించారు.