
భారతీయ సినీ చరిత్రలో రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐదు దశాబ్దాలుగా ఆయన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రజనీ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో పూనకాలే. అంతలా చిన్నవారి నుంచి పెద్దల వరకు ఆయన చిత్రాలను విపరీతంగా ఆదరిస్తారు. సినిమాల్లో ఆయన స్టైల్, డైలాగ్, స్టెప్పులకు థియేటర్లు ఈలలతో దద్దరిల్లిపోవాల్సిందే. ఇలా గత 50 ఏళ్లుగా ఒకే స్థాయిలో స్టార్ డమ్ కొనసాగిండం ఒక్క 'తలైవర్' కు మాత్రమే సాధ్యమైంది.
బస్ కండక్టర్ నుండి సూపర్ స్టార్ వరకు
1975లో లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అపూర్వ రాగంగళ్'తో రజినీకాంత్ సినీ ప్రయాణం మొదలైంది. బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న యువకుడి ( రజనీకాంత్ )లో ఆ స్పార్క్‌ను గుర్తించి, బాలచందర్ ఆయనకు తొలి అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో రజినీ చిన్న పాత్రలో నటించినా, ఆయన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 'మూండ్రు ముడిచ్చు', '16 వయతినిలే' వంటి చిత్రాలు విలన్‌గా ఆయన స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి. కొద్ది సంవత్సరాలకే, ఆయన విలన్ పాత్రల నుండి మాస్ హీరోగా ఎదిగారు. 'భైరవి' చిత్రంతో సోలో హీరోగా మారిన రజనీకాంత్ కు "సూపర్ స్టార్" అనే బిరుదు లభించింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు.
యాక్షన్, స్టైల్‌తో సంచలనం
1980లు, 90లలో 'మురట్టు కాళై', 'దళపతి', 'ముత్తు', 'బాషా' వంటి చిత్రాలతో రజినీ ఒక సంచలనంగా మారారు. ముఖ్యంగా 'బాషా' ఒక సాధారణ ఆటో డ్రైవర్ నుండి భయపడే డాన్‌గా ఆయన మారే సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తాయి. సిగరెట్ ఫ్లిప్, ప్రత్యేకమైన నడక, పవర్ ఫుల్ డైలాగ్స్ ఆయనకు ట్రేడ్‌మార్క్‌గా మారాయి.
►ALSO READ | OTTలోకి 'సైయారా'.. రొమాంటిక్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
సినిమా రంగంలో సాంకేతికత మారినట్లే, రజినీకాంత్ కూడా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకున్నారు. 2000లలో వచ్చిన 'శివాజీ', ఆ తర్వాత 'రోబో' (Enthiran) చిత్రంలో చిట్టి రోబోగా, హీరోగా, విలన్‌గా విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'కబాలి', 'కాలా' లాంటి చిత్రాలతో సామాన్య ప్రజల కష్టాలను చూపించారు. మాస్ సన్నివేశాలతో తన అభిమానులను మెప్పించారు. 'పేట'తో తన పాత స్టైల్‌ను తిరిగి తీసుకొచ్చి, 'జైలర్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
50 ఏళ్ల తర్వాత కూడా తగ్గని స్టార్‌డమ్
లేటెస్ట్ గా విడుదలైన'కూలీ'తో రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం మరో శిఖరం చేరింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంలో హై- యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కోర్‌ను కూడా అందించారు. 'తలైవర్' నుండి అభిమానులు ఆశించే థ్రిల్, మనసును మెప్పించే కథనాన్ని అందించారు. 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను బద్దలు కొట్టాయి. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు ప్రేక్షకులు క్యూకడుతున్నారు. సినిమా విడుదలను ఒక పండుగలా జరుపుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ తగ్గిపోతున్న తరుణంలో రజనీ క్రేజ్ మాత్రం రోజు రోజుకు మరింత పెరుగుతోంది.
ఒక చిన్న పాత్రతో సినీ జీవితాన్ని ప్రారంభించి .. నేడు భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక నటుడిగా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆర్థ శతాబ్దం గడిసినా ఆయన లాంటి వారు మరొకరు లేరు. ఆగస్టు 14న విడుదలైన ' కూలీ' మూవీ చూస్తుంటే .. ఆయనలో జోష్ మరింత పెరిగిందనే చెప్పాలి. రజనీ మేనియా కొనసాగుతోంది.