అమ్మ కడుపుతో అద్దె వ్యాపారం.. హైదరాబాద్లో తల్లీకొడుకు చేస్తున్న చీకటి దందా వెలుగులోకి..

అమ్మ కడుపుతో అద్దె వ్యాపారం.. హైదరాబాద్లో తల్లీకొడుకు చేస్తున్న చీకటి దందా వెలుగులోకి..

హైదరాబాద్: మేడ్చల్లో కమర్షియల్ సరోగసి, ఇల్లీగల్ ఎగ్ ట్రేడింగ్ రాకెట్ గుట్టురట్టయింది. అధికారుల తనిఖీల్లో సరోగసీ సెంటర్ బాగోతం బయటపడింది. అనుమతి లేకుండానే సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నరెద్దుల లక్ష్మీరెడ్డి, నరెద్దుల నరేందర్ రెడ్డి ఇద్దరినీ పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండానే ఎగ్ డొనేట్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. గతంలో అనుమతికి అప్లై చేసిన ఈ క్లినిక్ నిర్వాహకులు, అనుమతులు రాకపోయినా అక్రమంగా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.

హైదరాబాద్‌లో ఏడుగురు మహిళలు, ఒక వ్యక్తి కలిసి కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారు. పిల్లలు లేని జంటల బలహీనతను ఈ గ్యాంగ్ సొమ్ము చేసుకుంది. గ్యాంగ్ లీడర్ నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మికి గతంలోనే ఎగ్ డోనర్, సరోగేట్ మదర్‌గా అనుభవం ఉంది. ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి JNTUలో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. అమ్మకి తోడుగా ఈ వ్యాపారంలోకి దిగాడు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను ఎగ్ డోనర్ లేదా సరోగేట్ మదర్‌గా చేయించి డబ్బు సంపాదిస్తున్నారు.

నిందితుల దగ్గర నుంచి 6 లక్షల 47 వేల డబ్బు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు సీజ్ చేశారు. 5 స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్ కూడా లభ్యమైంది. లక్ష్మీరెడ్డికి క్రైం రికార్డ్ కూడా ఉంది.

2024లో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో కూడా ఆమె నిందితురాలు అని తేలడంతో అధికారులు విస్తుపోయారు. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాకం బయటపడి డాక్టర్ నమ్రత జైలు ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే.