
- అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
- ఆలయ కూల్చివేతపై లంచ్‌మోషన్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేత వివరాలు అందజేయాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రపరచాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైదారబాద్ కలెక్టర్, తహసీల్దార్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఆలయాన్ని కూల్చడం, ఆపై విగ్రహాన్ని తొలగించడం ద్వారా భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని, రాజ్యాంగంలోని 14, 21, 25, 26 అధికరణలను ఉల్లంఘించారంటూ హిమాయత్‌నగర్‌కు చెందిన పల్లె వినోద్ కుమార్ రెడ్డి హైకోర్టులో గురువారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఈ పిటిషన్‌ను విచారించారు. పిటిషనర్ అడ్వకేట్ వాదిస్తూ.. కూల్చివేతకు ముందు ఆలయమున్నట్టుగా అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, దేవాదాయ శాఖ పర్యవేక్షణలో స్థానిక భక్తుల పర్యవేక్షణలో తిరిగి విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. నిర్ణీత కాలపరిమితిని నిర్ణయించి ప్రభుత్వ నిధులతో నిర్మాణం పూర్తి చేయించాలని కోరారు. విగ్రహ తొలగింపుపై కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని, కూల్చివేతలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరారు.
గత జూలై 24న అర్ధరాత్రి 3 గంటల సమయంలో అధికారులు వచ్చి గుడిని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని సైతం తొలగించారని అన్నారు. వారి చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నందునే అర్ధరాత్రి కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అది ప్రభుత్వ భూమి అని, అక్రమణలకు గురికాకుండా ఉండేందుకే ఆ విధమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, తదుపరి విచారణ వరకు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.