తగ్గనున్న పన్నుల భారం.. ఇక రెండు స్లాబులే ! వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకునే చాన్స్

తగ్గనున్న పన్నుల భారం.. ఇక రెండు స్లాబులే ! వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకునే చాన్స్
  • తొలగనున్న 12 శాతం, 28 శాతం స్లాబ్‌ రేట్లు
  • జనం వాడే 99% సాధారణ వస్తువులు 5%  స్లాబ్‌లోకి
  • 28% స్లాబ్‌లోని 90% వస్తువులు 18 శాతానికి మార్పు
  • ప్రతిపాదనలను మంత్రుల బృందానికి పంపిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రజలపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌‌‌‌టీ) భారం తగ్గనుంది.   కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం సులభమైన రెండు స్థాయిల విధానాన్ని ప్రతిపాదించింది. ఇందులో "స్టాండర్డ్",  "మెరిట్" స్లాబ్‌‌‌‌లు ఉంటాయి.  అలాగే కొన్ని ప్రత్యేక వస్తువులకు ప్రత్యేక రేట్లు ఉంటాయి.  ప్రధాని  మోదీ స్వాతంత్ర్య దినోత్సవం  ప్రసంగం తర్వాత  ఈ ప్రతిపాదన వచ్చింది.  దీపావళి నాటికి జీఎస్‌‌‌‌టీలో తదుపరి తరం సంస్కరణలు వస్తాయని, సామాన్య ప్రజలకు గణనీయమైన పన్ను ఉపశమనం కలుగుతుందని, చిన్న వ్యాపారాలకు లాభం చేకూరుతుందని ఆయన  చెప్పారు. ప్రభుత్వం జీఎస్‌‌‌‌టీ రేట్ల సరళీకరణ, సంస్కరణలపై తన ప్రతిపాదనను జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి పంపింది.

జీఎస్‌‌‌‌టీ 2.0 లో ఏముండొచ్చంటే?

  • అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులు, మహిళలు, విద్యార్థులు, మధ్య తరగతి, రైతులకు లాభం కలిగించేలా పన్ను రేట్లను సులభం చేయనున్నారు.
  • సామాన్య వస్తువులు, లగ్జరీ వస్తువులపై పన్ను తగ్గించడం ద్వారా  వినియోగం పెంచాలని కేంద్రం చూస్తోంది.
  • రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్‌‌‌‌టీ పరిహార సెస్ ముగియడంతో  జీఎస్‌‌‌‌టీ రేట్లను తగ్గించడానికి వీలుకుదురుతుంది.
  • జీఎస్‌‌‌‌టీ 2.0 లో  ఇన్‌‌‌‌పుట్‌‌‌‌, ఔట్‌‌‌‌పుట్‌‌‌‌ పన్నుల మధ్య అసమతుల్యతను సరిచేసి, ఇన్‌‌‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌‌‌ కింద  పేరుకుపోయే మొత్తాన్ని తగ్గించనున్నారు.
  • వస్తువుల వర్గీకరణ సమస్యలను పరిష్కరించడం, రేట్ల నిర్మాణాన్ని సులభం చేయడం,  వివాదాలు తగ్గించడం, అన్ని రంగాల్లో సమానత్వం, స్థిరత్వం తీసుకురావడం జీఎస్‌‌‌‌టీ 2.0 ముఖ్య ఉద్దేశం. "పన్ను విధానంలో దీర్ఘకాలిక స్పష్టతనిచ్చి  పరిశ్రమల నమ్మకాన్ని పెంచడమే టార్గెట్‌‌‌‌" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, జీఎస్‌‌‌‌టీని ప్రభుత్వం 2017లో అమల్లోకి తెచ్చింది.   దేశంలోని పరోక్ష పన్ను వ్యవస్థను ఒకచోటికి చేర్చి,   చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు  వ్యాపారం చేసుకోవడాన్ని సులభతరం చేసింది.

5 శాతం..18 శాతం
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం, ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్‌‌‌‌ల స్థానంలో 5శాతం,  18 శాతం  అనే రెండు స్లాబ్‌‌‌‌లు మాత్రమే  కొనసాగనున్నాయి.  సాధారణ ప్రజలు ఉపయోగించే వస్తువులలో 99 శాతం (ప్రస్తుతం 12 శాతం స్లాబ్‌‌‌‌లో ఉన్నవి) 5శాతం స్లాబ్‌‌‌‌లోకి మారనున్నాయి. అలాగే, 28శాతం స్లాబ్‌‌‌‌లో ఉన్న 90శాతం వస్తువులు 18శాతం స్లాబ్‌‌‌‌లోకి వస్తాయి. కొన్ని ప్రత్యేక వస్తువులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి.

పొగాకుపై 40 శాతం జీఎస్‌టీ వేసే ఛాన్స్ ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎస్‌‌‌‌టీలో  5 శాతం, 12శాతం, 18శాతం, 28శాతం స్లాబ్‌‌‌‌లు ఉన్నాయి.  అవసరమైన వస్తువులకు తక్కువ పన్ను లేదా మినహాయింపు ఉంది. లగ్జరీ, డీమెరిట్ వస్తువులకు పరిహార సెస్‌‌‌‌ కూడా వర్తిస్తుంది. తదుపరి జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్ మీటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో జరగనుంది. కానీ, కచ్చితమైన తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.