ఈడెన్ గార్డెన్స్‌లో రాహుల్ కిరాక్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ ముందు 204 రన్స్ భారీ లక్ష్యం.. 

ఈడెన్ గార్డెన్స్‌లో రాహుల్ కిరాక్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ ముందు 204 రన్స్ భారీ లక్ష్యం.. 

DC vs KKR: ఐపీఎల్ (IPL 2026) లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బౌలర్లను తిప్పి తిప్పి కొట్టిండ్రు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయినా.. సీజన్‌ను గెలుపుతో ముగించాలనే కసితో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగిపోయిండ్రు. గిప్పుడు కేకేఆర్ మ్యాచ్ గెలవాలంటే 204 రన్స్ కొట్టాల్సి ఉంది. 

ఓపెనర్ల మంచి ఆరంభం: 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ గ్రౌండ్‌లోకి రాగానే అస్సలు తగ్గకుండా మంచి ఆరంభం ఇచ్చిండ్రు. టీమ్ స్కోరు 40 పరుగుల దగ్గరున్నప్పుడు సౌరభ్ దూబే బౌలింగ్‌లో పోరెల్.. తేజస్వి దహియాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరిండు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాహిల్ పరాఖ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 24 రన్స్ చేసిండు. కానీ సునీల్ నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి అజింక్య రహానే చేతికి చిక్కి అవుట్ అయిండు. 

కేఎల్ రాహుల్ క్లాసీ బ్యాటింగ్:  
వికెట్లు పడుతున్నా ఒకవైపు కేఎల్ రాహుల్ మాత్రం తన క్లాసీ షాట్లతో కేకేఆర్ బౌలర్లను ఉతికేశాడు. ఈ ఐపీఎల్‌లో తన మార్క్ షాట్లతో మరో అద్భుతమైన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసిన రాహుల్.. అనుకూల్ రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. 

చివర్లో అక్షర్, మిల్లర్ దూకుడు: 
కేఎల్ రాహుల్ అవుట్ అయినా.. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ ఇద్దరూ చెలరేగిపోవడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు ఉరుకులు పెట్టింది. టీమ్ స్కోరు 166 రన్స్ దగ్గర ఉన్నప్పుడు అక్షర్ పటేల్ (39)ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేసిండు. ఆ తర్వాత మిల్లర్‌తో జతకలిసిన యంగ్ బ్యాటర్ అశుతోష్ శర్మ దుమ్మురేపడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల మార్కును అందుకుంది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే రెండు వికెట్లు తీసుకోగా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయల్ తలో వికెట్ పడగొట్టారు.