మే 7 దాకా కస్టడీ..కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్​ పొడిగించిన కోర్టు 

మే 7 దాకా కస్టడీ..కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్​ పొడిగించిన కోర్టు 

న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ కు జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాల పాటు ట్రయల్ కోర్టు పొడిగించింది. తిరిగి మే 7న ఆయనను కోర్టులో హాజరుపరచాలని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా మంగళవారం ఆదేశాలు ఇచ్చారు.

కాగా, మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. కేజ్రీవాల్ కు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ మంగళవారంతో ముగియడంతో అధికారులు ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. 

కేజ్రీవాల్ కు ఇన్సులిన్.. 

కేజ్రీవాల్ కు షుగర్ లెవెల్స్ పెరగడంతో తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ ఇచ్చారు. ‘‘సోమవారం రాత్రి 7గంటలకు కేజ్రీవాల్ కు షుగర్ లెవల్ 217 వచ్చింది. దీంతో ఇన్సులిన్ ఇవ్వాలని ఎయిమ్స్ డాక్టర్లు సూచించారు. వాళ్ల సూచన మేరకు లో డోస్ తో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చాం” అని జైలు అధికారులు తెలిపారు. కాగా, హనుమంతుడి ఆశీర్వాదంతోనే కేజ్రీవాల్ కు ఇన్సులిన్ అందిందని ఆప్ నేతలు అన్నారు. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ కామెంట్లు చేశారు. ‘‘కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇవ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినా జైలు అధికారులు నిరాకరించారు.

కానీ హనుమంతుడి ఆశీర్వాదంతో కేజ్రీవాల్ కు ఇన్సులిన్ అందింది. ఆయన త్వరలోనే విడుదల కావొచ్చు” అని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ‘‘జై బజరంగ్ భళీ! హనుమాన్ జయంతి రోజున గుడ్ న్యూస్ అందింది. తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చారు. ఇదంతా ఆ హనుమంతుడి ఆశీర్వాదంతో జరిగింది” అని మరో మంత్రి ఆతిశీ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.