
న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై సీబీఐతో దాడులు చేయించిన తర్వాత గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఓట్ షేర్ 4శాతానికి పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది ఆప్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పారు. సిసోడియాను అరెస్టు చేస్తే.. ఇంకో 2 శాతం ఓటు షేర్ పెరుగుతుందని వివరించారు. ఢిల్లీ అసెంబ్లీలో గురువారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ విజయం సాధించారు. అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులుండగా.. ఆప్ నుంచి 62 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. విశ్వాస పరీక్షలో హాజరైన ఆప్ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీకే ఓటేశారు. ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు విదేశాల్లో, మరొకరు జైల్లో ఉన్నారు. మిగిలిన 59 మందిలో ఒకరు స్పీకర్‌గా ఉండటంతో.. 58 మంది సభ్యులు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్ జరుగుతున్న టైంలో బీజేపీ ఎమ్మెల్యేలు విజేందర్ గుప్తా, అభయ్ వర్మతో పాటు మోహన్ సింగ్‌లు డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని మార్షల్స్ సాయంతో సభ నుంచి బయటికి పంపించేశారు. దీన్ని నిరసిస్తూ.. మిగిలిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఆప్ ఎమ్మెల్యేలను కొనలేరు..
విశ్వాస పరీక్ష తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. నిజాయితీపరులైన ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనలేదనేది దేశంమొత్తానికి తెలిసిందన్నారు. ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయ్యిందన్నారు. జాతీయ స్థాయిలో రెండు పార్టీలే ఉన్నాయని, వాటిలో ఒకటి కట్టర్ ఇమాన్దార్ (పక్కా నిజాయితీ), మరొకటి కట్టర్ బెయిమాన్ (కఠిన అవినీతి) అని కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా ఇంట్లో సీబీఐ తనిఖీలు చేస్తే ఎలాంటి అవినీతి సొమ్ము దొరకలేదన్నారు. గ్రామంలోని ఆయన ఇంటితో పాటు బ్యాంకు లాకర్స్‌లో కూడా సెర్చ్ చేశారని వివరించారు. ఆప్ పార్టీ, సిసోడియా నిజాయితీపరులని మోడీయే సర్టిఫికేట్ ఇచ్చారన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు అవినీతి పార్టీ వే ల కోట్లు ఖర్చు చేస్తోందని, నిజాయితీగల పార్టీ స్కూళ్లు, ఆస్పత్రులు కట్టేందుకు ఖర్చు చేస్తోందన్నారు. నిజాయితీ పార్టీలో చదువుకున్న వాళ్లు, ఐఐటీ డిగ్రీలు పొందినవారు ఉన్నారన్నారు.