కరోనాపై ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

కరోనాపై ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలోని ఏ ప్రదేశంలోనూ కూడా 50మంది కంటే ఎక్కువ ప్రజలు ఒకే దగ్గర ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. యాభై మందికి మించిన మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఈ నెలాఖరు వరకు ఢిల్లీలో జిమ్ములు, నైట్ క్లబ్బులు, స్పాలను కూడా మూసివేస్తున్నామని తెలిపారు.

పెళ్లిళ్లకు ఆటంకం లేదు

ర్యాలీలు, సమావేశాలపై ఆంక్షలు విధించినప్పటికీ రాష్ట్రంలో జరిగే వివాహాలకు హాజరయ్యేవారిపై ఎలాంటి పరిమితి లేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే…. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని వాయిదా వేసుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆటోలు, ట్యాక్సీలను ఉచితంగా శుద్ధి చేయాలని నిర్ణయించారు. అంతేకాదు ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించేలా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

ఢిల్లీలో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, సిమ్మింగ్‌ పూల్స్ ను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించారు.