కేజ్రీవాల్​కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు

కేజ్రీవాల్​కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు
  • ఎమ్మెల్యేల కొనుగోలు  ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశం 
  • ఢిల్లీ సీఎం ఇంటి వద్ద 5 గంటల పాటు హైడ్రామా 

న్యూఢిల్లీ:  ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్​కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు. మూడ్రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని ఆదేశించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురిని కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని, ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. 

ఎలాంటి ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, నోటీసులు ఇచ్చే క్రమంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. స్వయంగా కేజ్రీవాల్ కే నోటీసులు అందజేస్తామని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుబట్టారు. అయితే నోటీసులు తమకు ఇవ్వాలని, తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ఆఫీస్ సిబ్బంది చెప్పారు. కానీ పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. అక్కడే 5 గంటలు వెయిట్ చేసిన పోలీసులు.. చివరకు సీఎం ఆఫీస్ సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారు.

ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం.. 

కేజ్రీవాల్ కు నోటీసులపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ‘‘ఏ చట్ట ప్రకారం నేరుగా కేజ్రీవాల్ కే నోటీసులు ఇవ్వాలని పట్టుబడుతున్నారని పోలీసులను నేను ప్రశ్నించాను. కానీ వాళ్లు జవాబు చెప్పలేకపోయారు. ఇదంతా ఒక డ్రామా” అని ఆప్ లీడర్ జాస్మిన్ షా మండిపడ్డారు. ‘‘బీజేపీ అసలు రూపం బయటపడింది. సీఎం ఆఫీస్ నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిందని పోలీసులు శుక్రవారం చెప్పారు. ఈరోజేమో నోటీసులు తీసుకుంటామన్నా ఇవ్వలేదు” అని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఫైర్ అయ్యారు. కాగా, అవినీతిలో కిరీటం లేని మహారాజు కేజ్రీవాల్ అని బీజేపీ విమర్శించింది. విచారణ అంటే చాలు.. ఆయన పారిపోతుంటారని ఎద్దేవా చేసింది.